Minister KTR : హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ సమావేశం గురువారం ప్రారంభం అయింది. 3 రోజులుగా ఈ కాంక్లేవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఐటీ రంగం గణనీయంగా పెరుగుతుందన్నారు. గత ఏడాది ఐటీ సెక్టార్‌లో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ బెస్ట్ సిటీగా నిలిచిందన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక వసతులు బాగున్నాయని తెలిపారు. హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరంగా సర్వేల్లో తెలిందన్నారు.
టాప్ కంపెనీల సెంటర్లు హైదరాబాద్ లో
ప్రపంచంలోని టాప్ 5 ఐటీ కంపెనీలు తమ రెండో అతిపెద్ద సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్ కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల బాగున్నాయన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, చెన్నైలో తేమ ఎక్కువ, ముంబయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అన్నారు. ఆయా ప్రాంతాల్లో రాజకీయ అనిశ్చితి ఉందన్నారు. కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ అద్భుతమైన ప్రదేశంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఆరు నెలలే రాజకీయాలు
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అనువైన విధానాలను అమలుచేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీహబ్, వీహబ్‌తో స్టార్టప్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తున్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. టాస్క్ ద్వారా డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యత శిక్షణ ఇస్తున్నామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. ఎన్నికల సమయంలో కేవలం 6 నెలలు మాత్రమే రాజకీయాలపై దృష్టి పెట్టి మిగతా నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగకల్పనపై దృష్టి పెడతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.