పట్టపగలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ ఖాతాల నుంచి డబ్బులు మాయమవడం చాలా ఆశ్చర్యం కలిగించిందని... ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల జిపియస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించిందని మాధవ్ ఆరోపించారు. పొరబాటున జరిగితే ఒకేసారి 80వేల ఖాతాల నుంచి ఎలా డ్రా అవుతాయని నిలదీశారు. 


విజయవాడలో పాత్రికేయ సమావేసాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ మాధవ్‌... వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గత నవంబర్‌లో కూడా ఇదే మాదిరిగా జీపీఎస్ ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయని ఇప్పుడు కూడా మాయమయ్యాయన్నారు. జమ చేసిన డబ్బును మళ్లీ విత్‌డ్రా చేయడమంటే ఉద్యోగాలను మోసం చేయడమే అని అభిప్రాయపడ్డారు మాధవ్. 


డే లైట్ రోబరీకి ప్రభుత్వం పాల్పడిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ మాధవ్. చర్యలు తీసుకోవాల్సిన వాళ్లే చోరీలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారాయన. పిఆర్సీ‌, హెచ్.ఆర్.ఎ, అలెవెన్స్‌ల విషయంలో కూడా మోసం చేసిందన్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జరిగిన తప్పును ఖండిస్తున్నామన్న మాధవ్... ప్రభుత్వం దుశ్యర్యకు పాల్పడిందని అందరికీ అర్థమైందన్నారు. పంచాయతీలకు చెందిన నిధులు ఇప్పటికే దారి మళ్లించారని... ఇప్పుడు ఉద్దేశ పూర్వకంగానే ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేశారని ఆరోపించారు. అప్పుల కోసం ప్రభుత్వమే అడ్డదారుల్లో‌ వెళుతుందన్నారు. ఇలాంటి చర్యలను తప్పు పట్టిన ఉద్యోగులను సస్పెండ్ చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా నల్లజెండాలు ఎగరేయాలన్న  వైసీపీ ఎమ్మెల్సీ కామెంట్స్‌ పార్టీ సమర్థిస్తుందో లేదో తేల్చాలన్నారు మాధవ్. ఈ తరహా వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. గతంలో తెలుగుదేశం ఇదేవిధంగా వ్యవహరిస్తే ప్రజలు అసహ్యించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 


ధర్మవరం సంఘటనపై డిజపి ఫిర్యాదు చేశామన్నారు మాధవ్. ఈ ప్రభుత్వ హయాంలో యాభై మంది వరకు బిజెపి కార్యకర్తలు దాడికి‌ గురయ్యారన్నారు. ధర్మవరం విషయం చాలా సీరియస్‌గా తీసుకున్నామని.. దీనిపై కేంద్రం హోం శాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటువంటి దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. 


 ఒకరోజు ముందే దాడి చేస్తామని చెప్పి విచక్షణారహితంగా బిజెపి కార్యకర్తలను కొట్టడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా పాలేగాళ్ళ రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో బిజెపి కార్యకర్తల పై జరిగిన దాడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పై కేసు నమోదు చేయాలని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్‌ను సూర్యనారాయణ కలిశారు. 


ముందు రోజు జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి దాడులు చేస్తామని చెప్పి మరుసటిరోజే తన అనుచరులను పంపించి దాడి చేయించారన్నారు. ఏదైనా సమస్య ఉంటే తనతో చూసుకోవాలి కానీ రెచ్చగొట్టి దాడులు చేయించడం అమాయకులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తామని ప్రజలు కూడా హర్షిస్తారు అన్నారు. అంతేకానీ దౌర్జన్యాలు భూకబ్జాలు చేస్తే తిరుగుబాటు తప్పదన్న విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డిని హెచ్చరించారు. తాడి ఘటనకు సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశామని తొందర్లోనే వాళ్లు కూడా ఇక్కడికి వస్తారని చెప్పారు.