Auto Fire Accident: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా, తాడిమర్రిలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి మహిళా కూలీలు సజీవ దహనమైన ఘటనపై ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హనుమంత రావు స్పందించారు. ఆ విద్యుత్ స్తంభంపైన ఉన్న ఉడత విద్యుత్ వైరును కొరకడం వల్ల వైరు తెగిందని, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటోపై పడి ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.


విద్యుత్ శాఖ తరపున చనిపోయిన వృద్ధులకు ఐదు లక్షల చొప్పున, క్షతగాత్రులకు రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈ ని ఆదేశించారు.


నారా లోకేశ్ మండిపాటు
కూలీలు మరణించిన ఘటన విషయంలో హనుమంతరావు స్పందనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ఘాటుగా ట్వీట్ చేశారు. 


‘‘తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి. ఇంకా నయం! కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయింది.’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.