శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం జగన్ దికగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగానిలుస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంఓ అధికారులు తెలియజేశారు. ఈ ఘటనపై విచారణ చేసిన నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బాధిత కుటుంబాలను పరామర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్.
తాడిమర్రి మండల ఘటనలో మృతుల కుటుంబాలకు 50లక్షల పరిహారం ఇవ్వాలి టీడీపీ డిమాండ్ చేస్తోంది. ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సంఘటన ప్రదేశాన్ని సందర్శించారు. విద్యుత్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకం విద్యుత్ వైర్ల వలనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు 50లక్షల పరిహారం ఇవ్వాలి.. గాయపడ్డ వారికి 20లక్షలు ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు.
ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండలంలో జరిగిన ప్రమాదంలో కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను కలిచివేసిందని చంద్రబాబు అన్నారు. నిర్లక్ష్యంతో ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నారా లోకేశ్ ట్వీట్
‘‘చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతులకి నివాళులర్పిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలి. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలి.’’ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
తాడిమర్రి మండలం బుడంపల్లికి చెందిన రైతు కూలీలు ఓ ఆటోలో వెళ్తుండగా, హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి ఆటోపై పడింది. వెంటనే మంటలు చెలరేగి కూలీలు సజీవ దహనం అయ్యారు. మొత్తం 8 మంది రైతు కూలీలు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ఈ చనిపోయిన వారంతా గుండంపల్లి వాసులుగా గుర్తించారు. వీరంతా వ్యవసాయ పనుల కోసం ఓ ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.