Minister Gudivada Amarnath : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ మరోసారి మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటిని తీర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. టాప్ అచీవర్స్ 7 రాష్ట్రాలను కేంద్రం ప్రకటిస్తే ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. పరిశ్రమలు పెట్టేవారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. గతంలో ర్యాంకింగ్ కు ఇప్పటి విధానానికి చాలా వ్యత్యాసం ఉందని మంత్రి అన్నారు. కేవలం సర్వే ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చారన్నారు. పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావడానికి ర్యాంకింగ్ ఉపయోగపడతాయన్నారు.
సీఎం జగన్ ప్రోత్సాహంతో
సీఎం జగన్ పరిరశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహమే ఈ ర్యాంకింగ్ కు నిదర్శనం. ఎమ్ఎస్ఎమ్ఈలు ఏర్పాటు, రూ.15 వేల కోట్లు పెట్టుబడి తేవాలి. ఒక లక్ష యాభై వేల మందికి ఉపాధి ఇచ్చే ఆలోచన సీఎం చేస్తున్నారు. ఆగస్టు నెలలో రూ. 500 కోట్ల ఇన్సెంటివ్ లు ఇవ్వబోతున్నాం. అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. దానికి సంబంధించిన కేలండర్ తయారు చేస్తున్నాం. సముద్ర తీరం ఉపయోగించుకుంటాం. మరో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు రానున్నాయి. దావోస్ లో ఒక లక్ష ఇరవై అయిదు కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నాం. ఐటీ అభివృద్ధికి మరింత ఆలోచన చేస్తున్నాం. ఇన్ఫోసిస్ రాబోతోంది. -మంత్రి గుడివాడ అమర్నాథ్
ఏపీ టాప్
ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. మళ్లీ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. టాప్ అచీవర్స్ లో ఉన్న 7 రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. 97.89 శాతం స్కోర్ తో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 97.77 శాతంతో రెండో స్థానంలో గుజరాత్ ఉండగా, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ స్కోర్ 94.86 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం టాప్ అచివర్స్‌లో 7 రాష్ట్రాల పేర్లను ప్రకటించారు. టాప్ అచీవర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాప్ అచీవర్స్ లో ఏపీ స్థానం దక్కించుకుంది. గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈసారి 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్ల నుంచి అభిప్రాయాల సేకరణ చేశారు. అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.