Jasprit Bumrah Captain: బూమ్‌.. బూమ్‌.. బుమ్రా మరో అడుగు ముందుకేశాడు. అత్యంత వేగంగా బంతులేయడం, వికెట్లు తీయడమే కాదు! నాయకుడిగానూ అదరగొడతానని అంటున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 35 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియాకు నాయకత్వం వహిస్తున్న తొలి పేసర్‌గా చరిత్ర సృష్టించబోతున్నాడు. 1987, నవంబర్‌లో చివరిసారి కపిల్‌దేవ్‌ (Kapil Dev) సారథ్యం వహించాడు. ఆ తర్వాత ఫాస్ట్‌ బౌలర్‌ నాయకుడు అవ్వడం ఇదే తొలిసారి. ఇక 2021 నుంచి భారత్‌కు సారథ్యం వహిస్తున్న ఎనిమిదో కెప్టెన్‌గా బుమ్రా (Jasprit Bumrah) రికార్డు లిఖించబోతున్నాడు.


ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన తర్వాత టీమ్‌ఇండియా లీసెస్టర్‌ షైర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఆట సాగుతుండగానే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా వారిన పడ్డాడు. ఫలితంగా లీసెస్టర్‌ హోటళ్లోనే ఐసోలేషన్‌కు వెళ్లాడు. అయితే అతడు మళ్లీ మ్యాచ్‌ ఆడాలంటే రెండుసార్లు నెగెటివ్‌ రావాలి. ఒకవేళ అతడు కోలుకోకపోతే కెప్టెన్‌గా ఎవరుంటారన్న సందేహాలు తలెత్తాయి. రిషభ్‌ పంత్‌, విరాట్‌ కోహ్లీ పగ్గాలు అప్పగిస్తారేమోనని అంచనా వేశారు. గతంలో అజింక్య రహానె వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అతనిప్పుడు జట్టులో లేకపోవడంతో ఆ బాధ్యతలను బుమ్రా చూస్తున్నాడు. అందుకే మ్యాచ్‌ పగ్గాలనూ బీసీసీఐ అతడికే అప్పగించింది.


Also Read: శుక్రవారమే ఫైనల్‌ టెస్టు! భారత్‌xఇంగ్లాండ్‌ షెడ్యూలు ఇదే!


కీలకమైన ఐదో టెస్టుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) లేకపోవడం బాధాకరమని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అంటున్నారు. తాము కోరుకుంటున్న పరిస్థితి ఇది కాదన్నారు. ఏదేమైనా తాము ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నాయకత్వం వహించగల కుర్రాళ్లు జట్టులో ఉన్నారని పేర్కొన్నారు. ఐదో టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.


'రోహిత్‌ను వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికైతే జట్టులోంచి తొలగించలేదు. అందుబాటులో ఉండాలంటే మాత్రం కచ్చితంగా నెగెటివ్‌ రావాల్సిందే. మ్యాచుకు ఇంకా 36 గంటల సమయం ఉంది. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అతడికి పరీక్షలు చేయొచ్చు. ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి మేం అతడిని చూసే అవకాశం లేదు. కానీ అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నాం' అని రాహుల్‌ ద్రవిడ్‌ అన్నారు.