Devendra Fadnavis: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ నేడే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆయనతో పాటు మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్‌తో భేటీ
ఏక్‌నాథ్ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబయి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అనంతరం భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ను ఆయన నివాసంలో కలిశారు.
ఆ తర్వాత వారిద్దరూ కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిసేందుకు రాజ్‌భవన్ బయలుదేరారు. ప్రభుత్వం ఏర్పాటు గురించి గవర్నర్‌తో వీరు చర్చించనున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని వీరు గవర్నర్‌కు తెలియజేయనున్నారు. అనంతరం మహారాష్ట్ర 20వ సీఎంగా ఫడణవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి లేదా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.
ఉద్ధవ్ రాజీనామా
శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్నీ వదులుకున్నారు. బలపరీక్షకు గవర్నర్ ఆదేశించడం, అందులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇక సభలో మెజారిటీ నిరూపణ కష్టమని తేల్చుకున్న ఠాక్రే రాజీనామా చేశారు.
ఇలా జరిగింది
శాసనసభను గురువారం ఉదయం 11 గంటలకు సమావేశపరిచి, బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ.. ముఖ్యమంత్రి ఠాక్రేను ఆదేశించారు. దీనిపై శివసేన అప్పటికప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి ఊరట లభించలేదు. గవర్నర్ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించి, అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని చెప్పింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా విచారణ కొనసాగించి రాత్రి 9.15 గంటల సమయంలో తీర్పు వెలువరించింది. తీర్పును గౌరవిస్తున్నట్లు ఠాక్రే చెబుతూ.. పదవి నుంచి దిగిపోతున్నట్లు ప్రకటించారు.
Also Read: UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన
Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!