ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో జపాన్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. సహజంగా రాజధాని ప్రాంతంలో ఇలాంటి భేటీలు జరుగుతుంటాయి కానీ, ఈ దఫా జపాన్ ప్రతినిధులు మంత్రి సొంత జిల్లా రావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోని అన్ని జిల్లాలతోపాటు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై మంత్రి ఇటీవల ఎక్కువగా దృష్టిసారించారు. ఆత్మకూరు ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం సహా.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకి ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని మంత్రి మేకపాటి కార్యాలయంలో జపాన్ ప్రతినిధులు ఆయనతో భేటీ అయ్యారు.
ఏపీలో జపాన్ పరిశ్రమల శాఖలను ఏర్పాటు చేయడంతోపాటు.. పెట్టుబడులు, ఐ.టీ పార్కులు, సెజ్ ల ఏర్పాటుపై చర్చించారు. ఇక ఏపీలోని విద్యార్థులకు జపాన్ టెక్నాలజీని పరిచయం చేయడం, నైపుణ్య శిక్షణ అందించడంపై కూడా చర్చ జరిగింది. ఏపీతో కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు జపాన్ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వంతో కలసి పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తపరిచారు.
ఏపీ ప్రభుత్వం ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్య రంగాలలో తీసుకువస్తోన్న వినూత్న సంస్కరణలను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. యువతకు ఉపాధి పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న చర్యలను వారికి తెలియజేశారు. సోమవారం మరోసారి భేటీ జరుగుతుందని, అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖల కార్యదర్శులతో చర్చించి ఆయా అంశాలపై ముందుకెళ్దామని మంత్రి వారికి చెప్పారు.
టెక్ గెంట్సియా సంస్థ సీఈఓ జాయ్ సెబాస్టియన్, మార్కెటింగ్ & సేల్స్ వైస్ ప్రెసిడెంట్ డెనిస్ యూజిన్ అరకల్, బ్లూ ఓషియన్ బిజినెస్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ఛైర్మన్ బెన్సి జార్జ్, హిడేహరు హ్యొడో ప్రతినిధులు మంత్రి గౌతమ్ రెడ్డితో భేటీ అయినవారిలో ఉన్నారు.
Also Read: AP Power Politics : ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?
Also Read: PapiKondalu: విషాదాన్ని దాటి ప్రారంభమైన పాపికొండల యాత్ర
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి