Breaking News Live: 10 ఓవర్లకు టీమిండియా స్కోరు 98/0 - ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Feb 2022 07:50 PM
10 ఓవర్లకు టీమిండియా స్కోరు 98/0 - ఇషాన్ కిషన్ అర్థ సెంచరీ!

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టీ20లో భారత్ 10 ఓవర్లలో వికెట్ కూడా నష్టపోకుండా 98 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (55 బ్యాటింగ్: 32 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా... తనకు తోడుగా రోహిత్ శర్మ (41 బ్యాటింగ్: 28 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు.

Visakhapatnam: విశాఖ జిల్లాలో రమణీయ దృశ్యాలు, పోటెత్తుతున్న పర్యటకులు

విశాఖ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మన్యం ప్రాంతాలైన పాడేరు, వంజంగి హిల్స్‌లో అబ్బుర పరిచే రమణీయ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో భారీ స్థాయిలో పర్యాటకులు పాడేరు ఏజెన్సీకి పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ సూర్యోదయం కాగానే కళ్ళ ముందు సాక్షాత్కరించే మంచు దుప్పటి, చేతికి అందేంత దూరంలో తేలియాడే మబ్బు లు, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వంజంగి కొండల పైనుంచి సూర్యోద యాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతున్నారు.

Vijayawada: బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం

విజయవాడ బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడున్న ఒక  కమర్షియల్ కాంప్లెక్స్ లోని రెండు ఫ్లోర్ లలో రెండు కోర్టులు నడుస్తున్నాయి. వీటిలో ఒకటైన నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నుంచి మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదే కాంప్లెక్స్ లో బ్యాంకుతో పాటు మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయి.

CM KCR Delhi Tour: రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (ఫిబ్రవరి 24) ఢిల్లీకి వెళ్లనున్నారు. కేసీఆర్‌తో పాటు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కూడా వెళ్లనున్నారు. ఈ రోజే సీఎం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయింది. థర్డ్ ఫ్రంట్‌ పనుల్లో భాగంగానే ముఖ్యమంత్రి హస్తినకు వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు, మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

Numaish: రేపటి నుంచే నుమాయిష్ ప్రారంభం

81వ పారిశ్రామిక ప్రదర్శన ‘నూమాయిష్‌’ ఎగ్జిబిషన్ పునఃప్రారంభానికి సిద్ధం అవుతోంది. వినోదం, విజ్ఞానంతో పాటు వస్తు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అనువైన ఈ ఎగ్జిబిషన్‌ను రేపటి నుంచి (ఫిబ్రవిర 25) సాయంత్రం ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 46 రోజుల పాటు సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు, ప్రభుత్వ సెలవు రోజుల్లో రాత్రి 11 వరకూ కొనసాగుతుందని సొసైటీ వర్గాలు తెలిపాయి. సుమారు 1,600 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.

YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీకి ఈసీ గుర్తింపు

వైఎస్ షర్మిలకు చెందిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీనే ప్రకటించింది. ఈసీ గుర్తింపు పత్రం జారీ చేసిన వేళ.. పార్టీ కార్యాలయంలో వైఎస్‌ షర్మిల కేకు కోశారు. ఈ వేడుకలో తల్లి వైఎస్‌ విజయమ్మ, భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ అవ్వకూడదనే ఉద్దేశంతో కొంత మంది ప్రయత్నాలు చేశారని, అయినా రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా గుర్తింపు పొందామని షర్మిల అన్నారు. వాయిదా పడిన వైఎస్‌ షర్మిల పాదయాత్రను 10 రోజుల్లో తిరిగి ప్రారంభిస్తారని పార్టీ సీనియర్‌ నేత చెప్పారు.

Ayyannapatrudu: అయ్యన్నపాత్రుడు ఇంటివద్ద పోలీసుల మోహరింపు

విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసు పోలీసులు ఆయన ఇంటివద్ద మోహరించారు. నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. విశాఖ పోలీసుల సాయంతో అయ్యన్నను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యన్న ఇంటివద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా మోహరించారు. 


అయ్యన్న పాత్రుడిపై పశ్చిమ గోదావరి నల్లజర్లలో వైసీపీ నేత రామకృష్ణ ఫిర్యాదు మేరకు 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారని అయ్యన్నపై ఫిర్యాదు చేశారు. నల్లజర్లలోని ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణ సభలో అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేశారు.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.


‘మధ్యాహ్న సమయం ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 దాకా కొనసాగుతున్నాయి. ఈ రోజు వేడిగాలుల ప్రభావం ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. అలాగే మరో వైపున కర్నూలు, కడప​, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడ కాస్తంత వేడిగా ఉంది. విశాఖ నుంచి నెల్లూరు దాక 100% తేమ ఉండటంతో ఉక్కపోతగా ఉన్నప్పటికీ అంత ఎండైతే లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా కస్తంత వేడి వాతావరణం కొనసాగుతోంది. మరో వైపున తూర్పు తెలంగాణ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడం, సూర్యాపేట​, ఖమ్మం, నల్గొండ​, వరంగల్ రూరల్/అర్బన్, మహబూబాబాద్ లో వేడి వాతావరణం కొనసగుతోంది. కొన్ని చోట్ల 38 డిగ్రీలను తాకుతోంది. హైదరాబాద్ లో అంతగా ఏమి వేడి లేదు.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది. ఉదయం సమయంలో అక్కడక్కడా పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉంది. సాధారణంగా 1.8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. 


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తగ్గింది. గ్రాముకు రూ.25 చొప్పున తగ్గింది. కానీ, వెండి ధర గత మూడు రోజులుగా నిలకడగానే ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు కూడా స్థిరంగా రూ.70,000 వద్ద ఉంది. రెండ్రోజులుగా వెండి ధర ఇలాగే ఉండగా.. నేడు కూడా అదే ధర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70 వేలుగా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.