High Rain Alert in Andhra Pradesh and Tamil Nadu | అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. రెండు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్రవాయుగుండంగా మారినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి దక్షిణ- ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో, నాగపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ- ఆగ్నేయంగా 800 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాయుగుండం ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 27న తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. దాంతోపాటు హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తాజాగా ఏర్పడనున్న తుపానుకు ఫెంగల్ అని నామకరణం చేశారు. నవంబర్ 27 నుంచి రెండు రోజులలో శ్రీలంక తీరం దాటి ఉత్తర- వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో నవంబర్ 26 నుండి 29 వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబర్ 27 నుండి 29 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మరోవైపు వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఏపీలో 27న తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందున ఈ ప్రాంతాలకు కూడా ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల నవంబర్ 28 నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసి ప్రజలను, రైతులను వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
తెలంగాణపై తుపాను ప్రభావం
తెలంగాణపై సైతం ఫెంగల్ తుపాను ప్రభావం ఉండనుంది. రేపట్నుంచి నాలుగైదు రోజులపాటు విపరీతంగా చల్లగాలులు వీచనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తుపాను ప్రభావంతో మరింత చల్లగా మారి ఉదయం పొగమంచు అధికంగా కురవనుంది.
ప్రాంతాలు గరిష్టం కనిష్టం
ఆదిలాబాద్ 28.8 9.7
భద్రాచలం 29.6 18
దుండిగల్ 28.4 13.2
హైదరాబాద్ 28.4 14.8
ఖమ్మం 31.2 18.4
మహబూబ్ నగర్ 29.4 18.2
మెదక్ 28.6 10.6
నల్గొండ 28.5 18
నిజామాబాద్ 30.5 14.2
రామగుండం 28 15.4
పటాన్‌చెరు 28.2 11.2
హయత్ నగర్ 28 15
Also Read: AP Rajya Sabha Election 2024: ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్