అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి ఎప్పుడో మొదలైంది. ఏఎన్ఆర్ మనవడు, కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహ వేడుక పనులు ఒక వైపు జరుగుతున్నాయి. మరో వైపు నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగింది.
అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే?
శోభిత ధూళిపాళతో అక్కినేని నాగచైతన్య వివాహం డిసెంబర్ 5వ తేదీన జరగనుంది. దీని గురించి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అన్న పెళ్లి కంటే ముందు అక్కినేని కుటుంబంలో మరో సంతోషకరమైన వేడుక తీసుకు వచ్చారు అఖిల్. పెద్ద కుమారుడు వివాహానికి ముందు చిన్న కుమారుడి నిశ్చితార్థం జరిపించారు నాగార్జున.
అఖిల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్. ఆవిడ ఒక ఆర్టిస్ట్. వీళ్ళిద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య అక్కినేని ఇంట్లో జరిగింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అఖిల్, జైనాబ్ పరిచయం జరిగిందని, ఆ తరువాత కొన్నాళ్లకు వాళ్ల మధ్య ప్రేమ చిగురించిందని అక్కినేని కుటుంబం ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
అఖిల్ పెళ్లి తేది ఇంకా ఖరారు చేయలేదు
అఖిల్ అక్కినేని పెళ్లి తేదీ ఇంకా ఖరారు చేయలేదని, వచ్చే ఏడాది మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తామని నాగార్జున తెలిపారు. ఈ సంతోషకర సమయంలో ఆయన మాట్లాడుతూ... ''తండ్రిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అఖిల్ తన జీవితంలో ఓ ముఖ్యమైన అడుగు వేశాడు. జైనాబ్ తో కలిసి జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అఖిల్ జైనాబ్ జంట బాగుంటుంది. అఖిల్ జీవితంలో జైనాబ్ రాకతో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ కొత్త ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మా రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నాయి'' అని చెప్పారు.
Also Read: టార్గెట్ రాజమౌళి, ప్రశాంత్ నీల్... యాక్షన్ ఎపిసోడ్స్ ఇరగదీసిన సుకుమార్ - జాతరకు పూనకాలే
అక్కినేని కుటుంబంలో ఒక శుభ ఘడియ తర్వాత మరొక శుభ ఘడియ వస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఇఫీ ఆయనకు ప్రత్యేక నివాళి అర్పించింది. నాగ చైతన్య పెళ్లి త్వరలో జరగనుంది. అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అక్కినేని ఫ్యామిలీ అభిమానులు వరుస శుభ ఘడియల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాబోయే కొత్త జంట అఖిల్ అక్కినేని, జైనాబ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: టీలో బిస్కెట్లు ముంచడం మంచిదేనా? బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?