ఏయ్ బిస్కెట్... అని ముంచొద్దు. అందులోనూ టీలో అసలు ముంచొద్దు. ఎందుకంటే అది మీ బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచే ప్రమాదం ఉంది. మెగాస్టార్ చిరంజీవి 'చాయ్ చటుక్కున తాగరా భాయ్' అని 'మృగరాజు' సినిమాలో పాట పాడారు. చాయ్ ఒక్కటే కాదు... దానితో పాటు బిస్కెట్లు తినడం చాలామందికి అలవాటు. టీలో బిస్కెట్లు ముంచుకుని తినడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌లో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసా?
టీ తాగితే షుగర్ లెవల్ ఎంత పెరుగుతుంది?
ఉదయాన్నే టీ / కాఫీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. ఒక కప్పు టీ కడుపులో పడిన తర్వాత పనులు మొదలుపెడతారు. టీ విషయానికి వస్తే... ఓ కప్పు టీలో ఒక స్పూన్ షుగర్ వేసుకుని తాగితే బాడీలోని బ్లడ్ షుగర్ లెవల్స్ 16 ఎంజి పెరుగుతుంది. మరి, బిస్కెట్లు కలిపి తీసుకుంటే?
టీ ప్లస్ స్వీట్ బిస్కెట్లు... మంచిది కాదండోయ్!
టీతో పాటు స్వీట్ బిస్కెట్లు తీసుకోవడం కొంత మందికి అలవాటు. స్వీట్ బిస్కెట్లు అంటే క్రీమ్, జామ్ వంటివి ఉన్నవి. అవొక్కటే కాదు... ఐదు, పది రూపాయల పార్లే జి బిస్కెట్స్ వంటివి కూడా!
కప్పు టీ, టేబుల్ స్పూన్ షుగర్, ఆరు పార్లే జి బిస్కెట్లు తీసుకుంటే... బ్లడ్ షుగర్ లెవల్స్ 16 ఎంజి నుంచి 55 ఎంజికి వెళుతుంది. అదే గనుక మీరు కప్పు టీతో మూడు జిమ్ జామ్ బిస్కెట్లు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ 42 ఎంజికి పెరుగుతుంది. పార్లే జి కంటే జిమ్ జామ్ మంచిదా? జిమ్ జామ్ బిస్కెట్లలో క్యాలరీలు, వెయిట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా? అంటే... జిమ్ జామ్ బిస్కెట్లలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. అది గ్లూకోజ్ లెవల్స్ తగ్గిస్తుంది.
స్వీట్ కంటే డైజెస్టివ్ బిస్కెట్లు ముంచడం మంచిదా?
హెల్త్ కాన్షియస్ చాలా మందిలో మొదలు అయ్యింది. స్వీట్ బిస్కెట్లు పక్కన పెట్టి చాలా మంది డైజెస్టివ్, ఫైబర్ కంటెంట్ ఉన్న బిస్కెట్లు తీసుకోవడం మొదలు పెట్టారు. మరి, టీలో ఆ బిస్కెట్లు ముంచితే ఏం జరుగుతుందో తెలుసా?
Also Read: లెమన్ టీని రోజూ ఉదయాన్నే రెగ్యులర్‌గా తీసుకుంటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో తెలుసా?
స్వీట్ కంటే డైజెస్టివ్ బిస్కెట్లు బెటర్. కప్పు టీ, ఒక టేబుల్ స్పూన్ చెక్కరతో వాటిని తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ / గ్లూకోజ్ లెవల్స్ కేవలం 31ఎంజికి మాత్రమే పెరిగాయి. ఎందుకీ డిఫరెన్స్ అంటే... స్వీట్ బిస్కెట్లు మైదాతో తయారు చేస్తే, డైజెస్టివ్ బిస్కెట్లు ఆటాతో చేస్తారు. మైదాతో కంపేర్ చేస్తే... ఆటా బిస్కెట్లలో ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది గ్లూకోజ్ లెవల్ తగ్గిస్తుంది.
సాల్ట్, కారా బిస్కెట్లు... రస్క్‌తోనూ రిస్క్ లేదు!
మరి ఉదయాన్నే ఏం తీసుకోవాలి? టీలో ఏం ముంచాలి? అంటే... స్వీట్ లేని బిస్కెట్లు. నాన్ స్వీట్ స్నాక్స్ తీసుకోవడం మంచిది. టీతో పాటు ఆరు (ఫర్ ఎగ్జాంపుల్ మొనాకో) సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కేవలం 20 ఎంజీకి పెరుగుతాయి. అదే కనుక మూడు కారా బిస్కెట్లు తీసుకున్నారుకోండి... బ్లడ్ షుగర్ లెవల్స్ 22 ఎంజీకి పెరుగుతాయి.
కొంత మందికి టీతో పాటు రస్క్ తీసుకోవడం అలవాటు. మీరు రస్క్ తీసుకున్నా రిస్క్ లేనట్టే. కప్పు టీ, స్పూన్ షుగర్, రెండు రస్కులు తీసుకుంటే... బాడీలో మీ గ్లూకోజ్ లెవల్స్ 27 ఎంజీకి పెరుగుతాయి అంతే.
Also Read: టీ, కాఫీలు తాగేవారికి బ్యాడ్ న్యూస్ ఇచ్చిన కొత్త అధ్యయనం.. వారికి ICMR గైడ్ లైన్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి... ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.