ICMR Dietry Guidelines : ఉదయాన్నే లేదా సాయంత్రం.. లేదా పనివేళల్లో చాలామంది కాఫీ, టీలు తాగుతారు. అవి లేకుంటే రోజు ప్రారంభం కానీవారు ఉన్నారు.. అవి లేకుంటే పని మీద ధ్యాస పెట్టలేనివారు కూడా ఉన్నారు. మరికొందరు ఉదయం నుంచి రాత్రి పడుకునేవరకు కాఫీనో, టీనో తాగుతూనే ఉంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరు అయితే ఈ షాకింగ్ విషయం మీకోసమే. ఈ రెండు పానీయాల్లో అధిక స్థాయిలో కెఫిన్​ ఉంటుందని.. అది కావాల్సిన స్థాయికంటే ఎక్కువ అవుతుందని ICMR తెలిపింది. 


అధిక స్థాయిలో కెఫిన్


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కాఫీ, టీలలో అధిక స్థాయిలో కెఫిన్ ఉంటున్నట్లు తెలిపింది. వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ICMR చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై.. కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో 17 మార్గదర్శకాలు జారీ చేసింది. దానిలో టీ, కాఫీ వినియోగంలో జాగ్రత్తలు కూడా ఒకటి. దీనిలో భాగంగానే కాఫీ, టీల రోజువారీ వినియోగ పరిమితిని కేవలం 300 mg కెఫిన్​ని మాత్రమే తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. 


రోజుకి ఎంత తాగాలంటే..


కెఫిన్ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రతికూలంగాప్రేరేపిస్తుంది. శారీరకంగా ఆరోగ్యసమస్యలు కలిగిస్తుందని పరిశోధన పేర్కొంది. ICMR టీ, కాఫీలలో అధిక మొత్తంలో కెఫిన్ ఉందని తెలిపింది. 1 కప్పు కాఫీలో 80 నుంచి 120 mg కెఫీన్, ఇన్​స్టంట్ కాఫీలో 50 నుంచి 65 mg ఉందని తెలిపింది. అయితే టీలో 30-65 mg కెఫిన్ ఉందని తెలిపింది. రోజుకి ఓ కప్పు టీ లేదా కాఫీతో సరిపెట్టుకునేవారికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. రోజు మొత్తంలో 5, 6 సార్లు తాగేవారు కచ్చితంగా అలెర్ట్​ అవ్వాలని.. కాఫీ,టీ వినియోగాన్ని 300mgకి పరిమితం చేయాలని సూచిస్తుంది. 


వాటికన్నా.. ఇవి బెటర్


టీ, కాఫీ లేకపోతే ఎలా.. మాకు కష్టం అనుకునేవారు బ్లాక్ టీ లేదా పాలు లేని టీ వీటికంటే ప్రయోజనకరంగా ఉంటుదని ICMR తెలిపింది. వాటి ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకుంటే.. ఇవి మెరుగైన రక్త ప్రసరణను, కొరినరీ ఆర్టరీ వ్యాధి, కడుపు క్యాన్సర్ ప్రమాదాలను దూరం చేస్తాయని తెలిపింది. ఇవే కాకుండా పండ్లు, కూరగాయలు, సీఫుడ్స్, మిల్లెట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ప్రోత్సాహించింది. ఇవి టీ, కాఫీ క్రేవింగ్స్​ని కంట్రోలే చేస్తాయని తెలిపింది. అంతేకాకుండా నూనె, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని ICMR సూచించింది. 



అప్పుడు మాత్రం అస్సలు తాగొద్దు..


ఇదే కాకుండా కాఫీ లేదా టీ తీసుకునే విషయంపై కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. టీ లేదా కాఫీ తాగడాన్ని భోజనం చేయడానికి ఓ గంట ముందు ఆపేయాలని చెప్తోంది. వీటిని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం వల్ల శరీరంలోని ఐరన్ శోషణ పరిమితం అవుతుందని తెలిపింది. ఇది టానిన్​లను పెంచుతుంది. అధిక స్థాయిలో టానిన్​లు ఉత్పత్తి అయితే ఐరన్ లోపం, రక్తహీనతకు దారితీస్తాయని అధ్యయనం తెలిపింది. 


Also Read : ఆరోగ్యప్రయోజనాల కోసం ఆయిల్ పుల్లింగ్.. ఈ ఆయిల్స్ ఎంచుకుని ఇలా చేస్తే చాలా మంచిది