Choose Your Oil for Oil Pulling : నోరు మంచిదైతే.. ఊరు మంచిది అవుతుంది అంటారు. దాని సంగతేమో కానీ.. నోరు మంచిగా ఉంటే.. మొత్తం ఆరోగ్యం మంచిది అంటున్నారు నిపుణులు. అయితే నోరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆయిల్ పుల్లింగ్ని కచ్చితంగా ఫాలో అవ్వాలి అంటున్నారు. ఈ మధ్యకాలంలో దీనికి ప్రాముఖ్యత పెరిగింది కానీ.. ఇది ఎప్పటి నుంచే నోటి ఆరోగ్యం కోసం ఫాలో అవుతున్న అంశాలలో ఒకటి. ఆయుర్వేదంలో ఎన్నో దశాబ్ధాలుగా దీనిని ఫాలో అవుతున్నారు. అయితే ఈ ఆయిల్ పుల్లింగ్ నోటి ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది.. దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఆయిలు పుల్లింగ్ అనేది ఉదయాన్నే బ్రష్‌తో పాటు చేసే చర్య. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటిలో పేరుకుపోయిన హానికరమైన బ్యాక్టీరియా, టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. చిగుళ్ల వ్యాధి, పిప్పళ్ల ప్రమాదాలను తగ్గించి.. తాజా శ్వాసను అందిస్తుంది.
మెరిసే దంతాల కోసం..
ఆయిలు పుల్లింగ్ రెగ్యూలర్‌గా చేస్తే.. దంతాలు తెల్లబడతాయి. పంటిపై ఉన్న మరకలను తొలగించడంలో సహాయం చేస్తుంది. కొందరికి కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. ఇలా దంతాలపై కొన్ని మరకలు ఏర్పడతాయి. ఆయిల్ పుల్లింగ్ వల్ల మరకలు పోయి తెల్లని దంతాలు మీ సొంతమవుతాయి.
డీటాక్స్
ఆయిల్ పుల్లింగ్ నోటిలో రక్తప్రవాహం పెచుతుంది. దీనివల్ల శ్లేష్మ పొరల్లోని టాక్సిన్లు బయటకు వస్తాయి. ఇవి పూర్తి శరీరాన్ని కూడా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయని అంటారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది.
వాపు సమస్యలు దూరం
ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటి ఆరోగ్యమే కాదు.. శారీరకంగా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనిని రెగ్యూలర్‌గా చేసి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. చిగురు వాపుతోపాటు.. ఆర్థరైటిస్, తామర వంటి సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.
జీర్ణక్రియకు..
ఆయిల్ పుల్లింగ్ వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువగా విడుదలవుతాయని పలు అధ్యయనాలు తెలిపాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. దీంతో పాటు జీర్ణవ్యవస్థను, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
ఎలాంటి ఆయిల్ ఉపయోగించవచ్చు?
ఆయిల్ పుల్లింగ్‌లో సరైన నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు ప్యూర్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనెను ఎంచుకోవచ్చు. నేరుగా మిల్ దగ్గరికి వెళ్లి కొనుక్కున్నా.. చేయించుకున్నది వాడితే మరీ మంచిది. అధిక నాణ్యత, సేంద్రీయ నూనెలు ఎంచుకోవాలి. దీనిని ఎప్పుడూ రూమ్ టెంపరేచర్లోనే ఉంచాలి.
ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలంటే..
ఆయిల్ పుల్లింగ్ని మీరు మొదటిసారి ప్రారంభించాలనుకున్నప్పుడు టీస్పూన్ మోతాదులో నూనె తీసుకోవాలి. దానిని బాగా పొక్కులించాలి. మీకు సౌకర్యంగా మారేకొద్ది నూనెను పెంచవచ్చు. క్రమంగా టీస్పూన్ నుంచి టేబుల్ స్పూన్ వరకు క్వాంటిటీ పెంచవచ్చు. ఇలా నోటిలో వేసుకున్న ఆయిల్‌ను 15 నుంచి 20 నిమిషాల పాటు.. నోటిలోని అన్ని ప్రాంతాలకు వెళ్లేలా పుక్కులించాలి.
ఈ ప్రాసెస్‌లో నూనెను మింగకూడదు. ఎందుకంటే ఇలా చేసిన నూనె విషపదార్థాలతో నిండి ఉంటుంది. అనంతరం దానిని ఉమ్మివేయాలి. వెంటనే గోరువెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. బ్రష్ కూడా చేసుకుంటే సరిపోతుంది. దీనిని రోజువారి చర్యల్లో భాగం చేసుకుంటే నోటి ఆరోగ్యంతో పాటు.. మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Also Read : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.