Former Bihar Deputy CM Sushil Modi passes away | బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 72. బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేత సుశీల్ మోదీ గత కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ క్రమంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం (మే 13న) రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు.


ప్రధాని మోదీ దిగ్భ్రాంతి 
బిహార్ మాజీ మంత్రి సుశీల్ మోదీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీలో విలువైన సహచరుడు అని, తనకు దశాబ్దాలుగా మిత్రుడ్ని కోల్పోయాను అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘బిహార్ లో పార్టీ ఎదుగుదల, విజయంలో సుశీల్ మోదీ కీలక పాత్ర పోషించారు. ఇందిరా గాంధీ హయాంలో తెచ్చిన ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, విద్యార్థి రాజకీయాల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కష్టపడేతత్వం, స్నేహశీలిగా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.


 






సుశీల్ మోదీ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. బిహార్ రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ‘ఏబీవీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన సుశీల్ మోదీ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం ఆయన ఎంతగానో శ్రమించారు’ అమిత్ షా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.