PM Modi Properties News in Telugu: వారణాసి: గత అయిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదాయం రెట్టింపయింది. 2018-19 నుంచి 2022-23 వరకు తన ఆదాయం రెట్టింపు అయినట్లు మంగళవారం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో మోదీ తెలిపారు. అయితే కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదాయం ప్రధాని మోదీ కంటే 4 రెట్లు ఎక్కువ అని ఎన్నికల అఫిడవిట్ వివరాలతో తేలింది. 


తన మొత్తం ఆస్తుల విలువ (PM Modi Assets) రూ. 3.02 కోట్లు అని ప్రధాని మోదీ వారణాసిలో మే 14న సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2,85,60,338 (2 కోట్ల 85 లక్షల 60 వేల 3 వందల 38), నగదు రూపంలో రూ.52,920 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని, సొంత కారు, భూమి, ఇల్లు లేవు అని పేర్కొనడం విశేషం.




2018-2019లో ప్రధాని మోదీ ఆదాయం రూ.11.14 లక్షలు కాగా, 2022-23లో ఆదాయం రెండింతలు కావడంతో రూ.23.56 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ఆదాయం రూ. 1.02 కోట్లుగా ఉంది. ఇది ప్రధాని మోదీ ఆదాయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని వారణాసి లోక్‌సభకు నామినేషన్ సందర్భంగా వెల్లడైంది. 2018-19లో రాహుల్ ఆదాయం రూ.1.20 కోట్లు, అదే ఏడాది మోదీ ఆదాయం కంటే 10 రెట్లు ఎక్కువ విలువ ఇది.


ప్రధానమంత్రి కార్యాలయం నుంచి, బ్యాంకుల నుంచి వచ్చిన వడ్డీని ఆదాయంగా ఎన్నికల అఫిడవిట్ లో మోదీ బహిర్గతం చేశారు. గాంధీనగర్‌లోని కొంత భూమిలో తన వాటాను విరాళంగా ఇచ్చిన తరువాత మోదీ పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని ఏబీపీ న్యూస్ గతంలోనే రిపోర్ట్ చేసింది. ప్రధాని మోదీ డిక్లరేషన్ ప్రకారం, మార్చి 31 వరకు ఆయన వద్ద రూ. 1.73 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. తన పేరిట ఎలాంటి బాండ్స్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు లేవని వెల్లడించారు. ఓవరాల్ గా ప్రధాని మోదీ ఆస్తుల విలువ 3.02 కోట్లు కాగా, రాహుల్ ఆస్తులు రూ.20 కోట్లకు పైగా ఉంది. 


వారణాసి నుంచి మూడోసారి బరిలోకి..
2014లో గుజరాత్ లోని వడోదర, యూపీలోని వారణాసి నుంచి నరేంద్ర మోదీ పోటీ చేశారు. ఆపై ప్రధాని మోదీ 2019లో కేవలం వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మాత్రమే పోటీ చేసి.. ఆరు లక్షలకుపైగా మోజార్టీతో విజయం సాధించారు. తాజాగా 2024 ఎన్నికల్లో వరుసగా మూడో పర్యాయం వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న ప్రధాని మోదీ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు.


లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో విడతలో జూన్ 1వ తేదీన వారణాసిలో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ నుంచి పార్టీ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్‌, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ ప్రధాని మోదీపై పోటీ చేస్తున్నారు. మంగళవారం నామినేషన్ కు ముందు వారణాసి లోని కాళబైరవ ఆలయానికి వెళ్లి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా మాత ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం దాదాపు ఆరు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు.