Breaking News Live: మేఘాద్రి గడ్డ రైల్వే ట్రాక్ పై కానిస్టేబుల్ మృతదేహం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
విశాఖ మేఘాద్రి గడ్డ రైల్వే ట్రాక్ పై పోలీస్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ నాయుడు మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా మాడుగుల పీఎస్ లో భాస్కర్ నాయుడు కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. భాస్కర్ నాయుడు భార్య పిల్లలతో పెందుర్తి మండలం నాయుడు తోట దుర్గా నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రముఖ పాటల రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మేరకు సహకరించారు. కందికొండ కుటుంబసభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. సూరత్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో దారుణం జరిగింది. కుర్ర లింగరాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ పరిశీలించారు. నిందితుడు లింగరాజు భార్యని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యధిక వేగంతో వెళ్తున్న ఓ కారు నియంత్రణ తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. వెంటనే కారులో ఉన్న ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి పెద్దగా గాయాలు కాలేదు. కారు ఐమాక్స్ థియేటర్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందిని, మంచు విష్ణుతో ఓ సినిమా చేస్తున్నానని, అంతే కాకుండా కన్నడ, తమిళంలో మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరవరం సమీపంలో అదుపు తప్పి కారు కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, మరోవైపు రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి పూట ఎండ ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత అధికం కానుంది. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 32.8 డిగ్రీలు, నందిగామలో 38.4 డిగ్రీలు, నెల్లూరులో 34 డిగ్రీలు, తునిలో 36.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 34 డిగ్రీలు, అమరావతిలో 36.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలులు వీస్తున్నాయి. దీంతో రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 20కి దిగువన నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికం అవుతుంది. అనంతపురంలో 36.8 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 34.5 డిగ్రీలు, తిరుపతిలో 34.9 డిగ్రీలు, కర్నూలులో 37.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్ (Temperature in Telangana)
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నల్గొండలో 39 డిగ్రీలు నమోదు కాగా, భద్రాచలంలో 37.6 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 37.3 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, ఖమ్మంలో ఎండల తీవ్రత అధికం. నేటి నుంచి వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరతాయని అంచనా వేశారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) కాస్త పెరిగింది. గ్రాముకు నేడు రూ.20 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.100 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,400 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,800 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.74,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.74,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,400 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,800గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,700 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -