A Woman Died In Husband VRS Retirement Function: విధి అంటే ఇదేనేమో.. ఓ భర్త అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నాడు. మిగిలిన జీవితాన్ని ఆమెతో గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లోనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పని చేస్తున్నారు. భార్య దీపిక గృహిణి. గత కొంతకాలంగా ఆమె హృదయ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. వారికి సంతానం లేకపోవడంతో భార్య బాగోగులు చూసుకోవాలని దేవేంద్ర భావించారు.
రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే..
ఈ క్రమంలోనే మూడేళ్లు ముందుగానే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఉద్యోగులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఆఫీసులోనే రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భార్య దీపికను కూడా తీసుకెళ్లారు. దేవేంద్ర దంపతులను కుర్చీలో కూర్చోబెట్టిన ఉద్యోగులు.. వారిని పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరుగా సంతోషంగా వారితో ఫోటోలు దిగుతున్నారు. ఇంతలోనే దీపిక తీవ్ర అస్వస్థతతో కుర్చీలో వెనక్కు పడిపోయారు. దీంతో ఒక్కసారిగా షాకైన అక్కడి వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో దేవేంద్ర కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయనతో పాటు సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: Serial Killer : 18 నెలల్లో 11మంది హత్య - పురుషులనే టార్గెట్ చేసిన సీరియల్ కిల్లర్.. అసలు కథ ఇదే