Breaking News Live: ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ప్రకటన

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Feb 2022 10:56 PM
ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల ప్రకటన

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల నిర్వహణ స్థలాన్ని మార్చుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(మెరిట్స్) కాలేజీ గ్రౌండ్ లో బుధవారం 11 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించారు. గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఎయిర్ అంబులెన్స్ లో రేపు నెల్లూరుకు తరలించనున్నారు. 

పత్తికొండ బైపాస్ లో రెండు బైక్ లు ఢీ, ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా  పత్తికొండ బైపాస్ రోడ్ లో రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు నరేష్, నవీన్ మృతి చెందారు.  మరో ఇద్దరు యువకులు యూసుఫ్, నరేంద్ర పరిస్థితి విషమం ఉంది. వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

అనారోగ్యం పాలైన లాలు ప్రసాద్‌ యాదవ్‌, పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు

ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. స్టేబుల్‌గా ఉన్నారని వెల్లడించారు. 

Farmer Locks MRo Office: నల్లగొండ జిల్లాలో పెద్దవురా ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసిన రైతులు

Farmer Locks MRo Office In Nalgonda District: నల్లగొండ జిల్లా: పెద్దవురా తహశీల్దార్ కార్యాలయానికి తమ్మడపల్లి గ్రామ రైతులు తాళాలు వేశారు. తమ్మడపల్లి గ్రామంలో ఉన్న పట్టభూములను అసైన్డ్ భూములుగా మార్చిన కంప్యూటర్ ఆపరేటర్. 2019 నుండి ఇప్పటి వరకు క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ కావటం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. 220 సర్వే నెంబర్లులో సుమారుగా 1500 ఎకరాలను అసైన్డ్ భూములుగా మార్చారని ఆరోపించారు.

ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రైతుల కుటుంబాలు

ఉత్తర్‌ప్రదేశ్ లఖింపూరి ఖేరి బాధితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. లఖింపూరి రైతుల మరణాల కేసులో ఆశిష్ మిశ్రా నిందితుడిగా ఉన్నాడు.

అమలాపురంలో అధికారులు, వ్యాపారులు మధ్య ఉద్రిక్తత

అధికారుల కాళ్ళు పట్టుకున్న వ్యాపారులు
అమలాపురం బస్టాండ్ దగ్గర పళ్ళ వ్యాపారాలను మునిసిపల్ అధికారులు సోమవారం ఉదయం తొలగించారు. దాంతో వ్యాపారులు మునిసిపల్ అధికారుల కాళ్లపై పడి అడ్డుకున్నారు. అయినా అధికారులు వినలేదు. 40 సంవత్సరలనుండి ఇక్కడే బ్రతుకుతున్నాం. ఈరోజు నుండి మేము ఎలా బ్రతకాలి మహా ప్రభో అని వాపోయారు. ప్రత్యామ్నాయం చూపించకుండాఅధికారులు పేదోడి పొట్ట కొడుతున్నారని వారన్నారు. మా జీవనం ఎలా సాగించాలి అంటూ లబోదిబోమంటున్నారు. చివరకు జేసీబీలతో వ్యాపారుల కట్టడాలను కూల్చేసారు.

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీ కూతురు చనిపోగా... తండ్రి మరో కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలంలోని కేసారం గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ శివరాంపల్లికి చెందిన రవికిరణ్‌, స్రవంతి తమ కుమార్తెలు ధ్రువిక, మోక్షలతో కలిసి వికారాబాద్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కేసారం గేటు వద్దకు రాగానే... వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తల్లి స్రవంతి, కుమార్తె ధ్రువిక అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి రవికిరణ్‌, మోక్షలకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే, మరో కారులో ఉన్న వ్యక్తి సైతం తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.

భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ వాయిదా

విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది. - పవన్ కళ్యాణ్

శ్రీకాకుళం నానబల్లవారి వీధిలో ఓ ఇంటిలో పేలుడు

శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం నగరంలో నానబల్లవారి వీధిలో ఓ ఇంటిలో పేలుడు  సంభవించింది. వంట చేస్తున్న సమయంలో పేలినట్లు సమాచారం. కర్రలతో వంట చేస్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన మహిళ ఇందిర (50). పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

రాష్ట్రానికి గౌతమ్ రెడ్డి విశేష సేవలు అందించారు: ఎంపీ విజయసాయిరెడ్డి

పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యువ నాయకుడిగా, మంత్రిగా గౌతమ్ రెడ్డి రాష్ట్రానికి విశేషమైన సేవలందించారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను.

గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మధు యాష్కీ ప్రగాఢ సానుభూతి

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రంతి కలిగించిందని కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ భగవంతుణ్ణి ప్రార్థించారు.

మంత్రి మేకపాటి మృతికి చంద్రబాబు సంతాపం

అమరావతి: రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మేకపాటి మృతి కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి మృతి బాధాకరం అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు.

Botsa On Mekapati Death: మంత్రి మేకపాటి హఠాస్మరణంపై బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి

Botsa Satyanarayana On Mekapati Goutham Reddy Death:  మంత్రి మేకపాటి హఠాస్మరణంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి 


రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాస్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో  అన్నారు. చివరి నిముషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని , సానుభూతిని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Mekapati Goutham Reddy Is No More: గుండెపోటుతో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

Mekapati Goutham Reddy Passes Away: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. దుబాయ్ నుంచి భారత్‌కు నిన్ననే తిరిగొచ్చిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రికి గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఒక్కసారిగా పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అపోలో వైద్యులు వెల్లడించారు.

Fleet Review 2022: మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి.

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాలల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.


దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతాయిని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 18.6 డిగ్రీలు, కళింగపట్నంలో 22 డిగ్రీలు, బాపట్లలో 19.3 డిగ్రీలు, అమరావతిలో 19.3 డిగ్రీలు, విశాఖపట్నంలో 22.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.


రాయలసీమ​, తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సైతం భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 17.5 డిగ్రీలు, నంద్యాలలో 18.5 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీలు, కర్నూలులో 21.1 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తెలంగాణ వెదర్ అప్‌డేట్.. 
Telangana Weather Updates: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో వాతావరణం వేడెక్కుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యల్పంగా నల్గొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదు కాగా, ఆదిలాబాద్ లో 18.1, భద్రాచలంలో 20.8, దుండిగల్‌లో 18.2, మెదక్ జిల్లాలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.


బంగారం, వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా తగ్గింది. గ్రాముకు రూ.1 చొప్పున తగ్గింది. వెండి ధర నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,990 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న కిలోకు రూ.1400 పెరగ్గా రూ.70,000కు చేరింది. నేడు కూడా అదే ధర ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,990 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,990 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,000గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.