AP government has decided to issue government orders in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను మరింత విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ ఆదేశాల ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. జీవోలన్నీ ఇప్పటి వరకూ ఇంగ్లిష్ లో మాత్రమే వస్తున్నాయి. వాటినే జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఈ జీవోలు సామాన్య ప్రజలకు అర్థం కావు. తెలుగు అధికార భాష అయిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వాలని, తెలుగులోనే పరిపాలన సాగాలని చాలా కాలం నుంచి భాషాభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికి ఈ డిమాండ్ ను అంగీకరించింది..
Also Read: సజ్జల మళ్లీ ఇరుక్కున్నట్టేనా!- అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలపై సర్కారు సీరియస్
ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అందులో పలువురు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఏం చేయాలో సూచనలు చేశారు. అలాగే చంద్రబాబు శుక్రవారం హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభల సమాఖ్య సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలన్న అభిప్రాయం ఉన్నప్పటికీ పూర్తిగా జీవోలన్నీ ఇంగ్లిష్ కే పరిమితమయ్యాయి. ఇక నుంచి పద్దతి మార్చాలని నిర్ణయించుకున్నారు.
పాలనా పరంగా తెలుగు రాని అధికారులు కూడా ప్రభుత్వంలో ఉంటారు. ఇంగ్లిష్ కూడా జీవోలు ఉండటం వల్ల చాలా మందికి విషయాలపై స్పష్టత ఉంటుందని.. ఇంగ్లిష్ లో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. తమ భాషను కాపాడుకుంటూనే.. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదించి ముందుకెళ్తున్నారని కానీ తెలుగు వాళ్లు మాత్రం ఇంగ్లిష్ మాత్రమే నేర్చుకోవాలన్నట్లుగా పరిస్థితి మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసతున్నారు. దీన్ని మార్చే క్రమంలో తెలుగుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఇంగ్లిష్ లో ఉండే ఉత్తర్వులు, జీవోలు సామాన్య ప్రజలకు అర్థం కావు. అవి వెబ్ సైట్‌లో ఉన్నప్పటికీ ఇంగ్లిష్ కారణంగా చాలా మందికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అధికార ఉత్తర్వులు తెలుగులో వస్తే ప్రజలకు కూడా అర్థమవుతాయి. దీని వల్ల పాలనపై ప్రజల్లో అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు భాషాభిమానులు సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది.