CM Chandrababu Visit Datta Peetham In Vijayawada: ఉమ్మడి రాష్ట్రంలో విజన్ - 2020 అని ప్రకటిస్తే చాలా మంది తప్పుబట్టారని.. కానీ, ఆ విజన్ ఫలితాలు నేడు అందరికీ కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయవాడ (Vijayawada) పటమటలోని దత్త పీఠాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు గణపతి సచ్చిదానంద స్వామి ఘన స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలోని 42 ప్రాంతాల్లో చేపట్టబోయే దత్త క్షేత్రనాథ్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అనంతరం మాట్లాడారు. సమాజహితం కోసమే సచ్చిదానంద పని చేస్తున్నారని కొనియాడారు. 'స్వామీజీని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. సంపద రావాలి.. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ విషయంలో వెనకడుగు వేసేదే లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు తోడుగా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి. పేదరికం పూర్తిగా పోవాలి. ప్రజలు సంతోషంగా ఉండాలి. పేదరికం పూర్తిగా పోవాలి. రాష్ట్రాన్ని స్వర్ణాంద్ర వైపు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.


అటు, చంద్రబాబు కర్మయోగి అని.. ఆయన సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడమే కాకుండా.. స్వర్ణాంధ్ర సాకారం కావడం తథ్యమని పేర్కొన్నారు. ఆయనకు కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు


మరోవైపు, రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్‌పోర్టులు రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను గ్రౌండ్ చేసే పనులు మొదలుపెట్టింది. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం ఎయిర్‌పోర్టులను అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్ ఎయిర్ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా... పుట్టపర్తి ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్‌గా ఉంది. వీటికి తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సిద్ధం అవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ పోర్టుల విస్తరణ, నిర్మాణంతో పాటు, కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష చేశారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు. 


ప్రభుత్వం కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని - అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయనుంది. కుప్పం ఎయిర్‌పోర్ట్ కోసం ఫీజిబులిటీ రిపోర్ట్ సిద్ధం చేయగా.. 2 దశల్లో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగనుంది. మొత్తం 1200 ఎకరాలు ఇప్పటికే గుర్తించారు. శ్రీకాకుళం ఎయిర్‌పోర్టును 2 ఫేజుల్లో 1,383 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. దగదర్తి పోర్టుకు 635 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా.. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఒంగోలు ఎయిర్‌పోర్ట్ కోసం 657 ఎకరాలు గుర్తించారు.


Also Read: Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం