Tadipatri Dispute between JC Prabhakar Reddy and BJP is intensifying:  తాడిపత్రిలో దివాకర్ ట్రావెల్స్ కుచెందిన బస్సులు తగలబడటం వెనుక బీజేపీ నేతలున్నారని జేసీప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. డిసెంబర్ 31వ తేదీన మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే బీజేపీ నేతలు విమర్శలు చేశారని.. అయినా తాను నిర్వహించానని అందుకే బస్సులు తగులబెట్టారన్నారు. ఈ క్రమంలో ఆయన బూతులు అందుకోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


మాధవీలతపై కేసు పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు


తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో డిసెంబర్ 31న వేడుకలు నిర్వహించారు. ఈ పార్కులో నిర్వహించే వేడుకలకు వెళ్లవద్దని మాధవీలత ఓ వీడియో రిలీజ్ చేశారు. అక్కడ మహిళలకు భద్రత లేదని ..  జేసీ పార్కు వద్ద గంజాయి, డ్రగ్స్‌ బ్యాచ్‌లు ఉంటాయని ఆరోపించారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో మత్తులో వాళ్లు ఏమైనా  చేయవచ్చని అన్నారు. మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు.   పట్టణ మహిళలకు అవమానం జరిగేలా మాట్లాడారని అన్నారు.   మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాధవీలతపై తాడిపత్రిలో పోలీసు స్టేషన్‌లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయాలని కోరారు.  


తన బస్సులు బీజేపీ నేతలే తగుల బెట్టించారంటున్న జేసీ 


జనవరి 2వ తేదీన తెల్లవారిజామున జేసీ బస్సులు దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు తేల్చారు.  కానీ ఇది బీజేపీ నాయకుల పనే అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జగనే నయం అని.. జగన్‌ కేవలం తన బస్సులను సీజ్‌ చేయించారని.. కానీ మీరు మాత్రం బస్సులు తగలబెడుతున్నారంటూ బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని.. పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. 



Also Read: విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ కు ఇంకా దక్కని ఆమోదం - మోదీ పర్యటన ఖరారు




కూటమిలో ఉంటూ ఇలా మాట్లాడటం తగదని బీజేపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ  బీజేపీపై జేసీ ప్రబాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని  మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదని విమర్శించారు. జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జేసీ ఆయన వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.



Also Read: Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం