Numaish Started In Nampally Exhibition Ground: భాగ్యనగరంలో నుమాయిష్ (అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల) సందడి మొదలైంది. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండగా.. 84వ నుమాయిష్‌ను (Numaish) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు (Sridharbabu), పొన్నం ప్రభాకర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఒక్క విద్యా సంస్థ నడపాలంటేనే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని.. అలాంటిది 20 కళాశాలలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 2,400కు పైగా స్టాల్స్ ఒకే దగ్గర ఉండనున్నాయి. 1938లో నిజాం కాలం నుంచి మొదలైన నుమాయిష్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు.



అటు, సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ అన్నీ ఏర్పాట్లు చేసింది. గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్లను అందుబాటులో ఉంచింది. సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు.. సందర్శకులు మైదానంలో తిరిగేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జమ్మూకశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, యూపీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 15 వరకూ 46 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉండనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటైన నుమాయిష్‌లో.. ప్రముఖ పారిశ్రామిక సంస్థలు స్టాళ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతాయి. పిల్లలు, పెద్దలను అలరించేందుకు ఎగ్జిబిషన్‌లో టాయ్ ట్రైన్స్, గేమ్స్, మ్యాజిక్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసారి ఎగ్జిబిషన్ అంతా చుట్టి వచ్చేందుకు డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రదర్శనలో రూ.10 నుంచి రూ.లక్షల విలువైన వస్తువులు లభిస్తాయి.


Also Read: Allu Arjun Bail : అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు