Railway Board Relaxes Level 1 Posts Educational Criteria: రైల్వే శాఖలోని పలు విభాగాల్లో 32 వేల లెవల్ -1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 22న ముగుస్తుంది. అయితే, విద్యార్హతల విషయంలో రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలకు అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిష్‌షిప్ సర్టిఫికెట్ (NAC) కలిగిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. తాజాగా, ఈ విద్యార్హత ప్రమాణాలను సడలించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (జనవరి 7, 2025 నాటికి) 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు వయో సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం రూ.18 వేలు ఉంటుంది.

ఆర్ఆర్‌బీ రీజియన్లు

అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్.

ముఖ్యమైన తేదీలివే..

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23-01-2025.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.
  • జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీపీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.
  • పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్ తదితర వివరాలను ఆర్ఆర్‌బీ త్వరలో విడుదల చేయనుంది. అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు