Breaking News Live: విశాఖలో ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
విశాఖ అనకాపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి ఉమ్మలాడ రోడ్డులో తన ఇద్దరు ఆడ బిడ్డలను గొంతు నులిమి చంపింది తల్లి. తర్వాత తను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలు వివరాలు మెట్ట.అనూష (24), సుదీక్ష (5), గీతా న్విత (18 నెలలు)
రష్యా ఉక్రెయిన్ చర్చలు ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు చర్చలు కొనసాగాయి. బెలారస్ లో ఇరు దేశాల ప్రతినిధులు ఇవాళ సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో నాటోలో చేరబోమని ఉక్రెయిన్ రాత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా కోరింది. అందుకు ఉక్రెయిన్ అంగీకరించలేదని తెలుస్తోంది. అలాగే తక్షణమే తమ దేశం నుంచి బలగాలను వెనక్కి పిలవాలని ఉక్రెయిన్ రష్యాను కోరింది. అందుకు రష్యా అంగీకరించలేదని సమాచారం. దీంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి పయనమయ్యారు. ఆయన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి దిల్లీకి బయలుదేరారు. పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను కలిశారు.
మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 8వ తేదీన మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సభలో సంతాపం తెలుపుతారు. మార్చి 11న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అవ్వనున్నట్లు సమాచారం. మొన్ననే సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అంతేకాక, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ మధ్య టీఆర్ఎస్‌కు అతి దగ్గరగా మెలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయడం కోసం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి, సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఫైనాన్స్ సెక్రటరీ, సీఎంవో అధికారులు తదితర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లకు చెందిన తెలంగాణ వైద్య విద్యార్థినులు ఉక్రెయిన్ లో చిక్కుకోగా భయంతో బిక్కుబిక్కుమంటూ బంకర్ లలో తలదాచుకున్నారు. జీడిమెట్ల షాపూర్ నగర్ కు చెందిన విద్యార్థిని కల్పన కర్క్యూ సిటీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుకుంటున్నారు. ప్రస్తుతం కర్క్యూలో బాంబుల వర్షం మోగితుందని విద్యార్థిని అతని స్నేహితురాలు పేర్కొన్నారు. తమకు తినడానికి తిండి, నీరు సైతం అందుబాటులో లేదని వీడియోలో పేర్కొన్నారు. సుమారు ఐదు వేల మంది భారత విద్యార్థులు తమ పరిసరాల్లో ఉన్నారన్నారు. భారత ఎంబసీ నుంచి తమకి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తమను త్వరగా ఇండియాకి చేర్చాలని వేడుకుంటున్నారు. వారు తలదాచుకున్న బంకర్ వీడియో చూపించారు విద్యార్థులు. కేవలం వెస్ట్ సైడ్ ఉన్నవారిని మాత్రమే భారత్ కు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ రవాణాపై కర్నూలు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. కర్నూలు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తెల్లవారుజామున వాహనాల తనిఖీల్లో భారీగా బంగారు ఆభరణాలు వజ్రాలు పట్టుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా హైదరాబాద్ నుండి బెంగళూరుకు ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తున్న రాజస్థాన్ చెందిన కపిల్ అనే వ్యక్తి వద్ద తనిఖీ చేయడంతో రూ.39.28 లక్షల విలువ చేసే బంగారం ఆభరణాలు వజ్రాలు గుర్తించారు. విచారణ నిమిత్తం కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో తెలంగాణా ఎమ్మెల్సీ మదుసూదన్, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులు వేదాశీర్వచనం అందిచగా, టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టువస్త్రాలతో సత్కరించి, స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు.. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల తెలంగాణా ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ... తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామి వారికి మ్రొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వచ్చినట్లు ఆయన తెలిపారు.. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్దించానట్లు తెలిపారు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎల్లప్పుడూ కలిసి మెలసి ఉండాలని ఆయన ఆకాక్షించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న తోడు పథకం కింద మూడో విడత రుణాలను నేడు జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో దీన్ని ప్రారంభించనున్నారు. 5.10 లక్షల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయనున్నారు.
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో భారీగా మార్పులు జరుగుతాయి. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 చేరగా.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా, వేడిగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా ఉండటంతో, ఉక్కపోత పెరిగిపోతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలు ప్రభావం అధికం. పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు ఎలాంటి ఆంక్షలు లేవని వెదర్ అప్‌డేట్‌లో పేర్కొన్నారు. అత్యల్పంగా కళింగపట్నంలో 17.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీలు, బాపట్లలో 18.8 డిగ్రీలు, నందిగామలో 19.4 డిగ్రీలు, అమరావతిలో 19.2 డిగ్రీలు, విశాఖపట్నంలో 18.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేడెక్కతున్న రాయలసీమ..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇకనుంచి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు చలికి గజగజ వణికిన ఆరోగ్యవరంలో 26.5 డిగ్రీల మేర అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నా, మధ్యాహ్నాలు మాత్రం వేడి ఎక్కువ కావడంతో ఉక్కపోతగా ఉంటుంది. అనంతపురంలో 18.3 డిగ్రీలు, నంద్యాలలో 19 డిగ్రీలు, తిరుపతిలో 20.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. భద్రాచలంలో అత్యధికంగా 36.8 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 34.3 డిగ్రీలు, హైదరాబాద్‌లో 32.2 డిగ్రీలు, హకీంపేటలో 31.2 డిగ్రీలు, హన్మకొండలో 32 డిగ్రీలు, మహబూబ్ నగర్‌లో 35.4 డిగ్రీలు, నిజామాబాద్‌లో 34.9 డిగ్రీలు, రామగుండంలో 33.2 మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) అతి స్వల్పంగా తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా పరిణామంతో రెండ్రోజుల క్రితం బంగారం ధర అతి భారీగా ఎగబాకిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రాముకు ఏకంగా రూ.1 చొప్పున మాత్రమే తగ్గింది. వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,340 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,560 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.69,000 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,560గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,340 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,560గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,000 వేలుగా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -