విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. నూతన విద్యా విధానం అమలుపైనా ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానంలో ప్రణాళికల సిద్ధం చేశారు. మూడు విద్యా సంవత్సరాల్లో మూడుదశలుగా పూర్తిగా అమలు చేయనున్నారు. 25,396 ప్రైమరీ పాఠశాలలను.. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు విలీనం చేశామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని సీఎం జగన్ కు అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈసంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలన్నారు.
సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా సీఎం సమీక్ష చేశారు. 1092 స్కూల్స్ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్ జరిగాయని అధికారులు వివరించారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారని చెప్పారు. అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్ ఉందని ముఖ్యమంత్రికి చెప్పారు. ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ ఇవ్వడం రికార్డని తెలిపారు.
టీచర్ ట్రైనింగ్ ఇస్తున్న డైట్ సంస్థల సమర్థత పెంచాలని సీఎం ఆదేశించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని స్పష్టం చేశారు. టీచర్లకు శిక్షణకార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని ఆదేశించారు. 'స్కూళ్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్ పెట్టాలి. ప్రతి స్కూళ్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలి. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలి.' అని సీఎం అన్నారు.
ఇంగ్లిషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీనికోసం పాఠ్యప్రణాళికపై దృష్టిపెట్టాలి. పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలి. ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుంది. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనంచేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశం. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతంలేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలుకూడా తగవు.
- జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి
మరుగుదొడ్లు నిర్వహణ
ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాలన్నారు. అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలన్నారు. పాఠశాలలో పరిస్థితులను నాడు నేడు ద్వారా మార్చమని చెప్పారు.
జగనన్న గోరుముద్దపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు.
Also Read: AP BJP : ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ? ఏపీ బీజేపీ నేతలకు చివరి చాన్స్ !?
Also Read: Kuppam Result : వైఎస్ఆర్‌సీపీ - 19 , టీడీపీ - 6 .... కుప్పంలో జెండా పాతిన అధికారపార్టీ !