Breaking News Live Telugu Updates: జింఖానా గ్రౌండ్స్ వద్ద అదుపుతప్పిన పరిస్థితి, పోలీసుల లాఠీచార్జి - పలువురు ఆస్పత్రికి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Sep 2022 12:22 PM
IND Vs AUS Match in Hyderabad: జింఖానా గ్రౌండ్స్ వద్ద అదుపుతప్పిన పరిస్థితి, పోలీసుల లాఠీచార్జి - పలువురు ఆస్పత్రికి

భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ హంగామాతో హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిపై లాఠీచార్జి చేశారు. దీంతో దాదాపు 20 మంది వరకూ క్రికెట్ అభిమానులు కింద పడిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నేడు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. జింఖానా గ్రౌండ్ వద్ద అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

NIA Raids in Guntur: గుంటూరులో ఎన్ఐఏ అధికారుల సోదాలు

గుంటూరులో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు భారీ కేంద్ర బలగాలతో గుంటూరుకు చేరుకున్న అధికారులు పాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో సోదాలు చేశారు. పిఎఫ్ఐ కేసు దర్యాప్తు లో భాగంగా అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసినట్టు తెలుస్తుంది. ఆరు గంటల పాటు సోదాలు చేసిన అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పొత్తూరువారిపేటకు చెందిన రహీం,సంగడి గుంటకు చెందిన వహిద్, జఫ్రూల్లా ఖాన్ లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ముస్లింలు కావడం తో ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండడంతో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. ముగ్గురు వ్యక్తులు కూడా ఎస్ డిపిఐ, పిఎఫ్ఐ పార్టీలు అనుబంధంగా పని చేస్తున్నట్టు అనుమానంతో అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్ ఐ ఎ సోదాలు ముస్లింల ప్రాంతాల్లో జరగడం తో ముస్లింలు ఆందోళన లకు సిద్ధమవుతున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం తెలిసింది.

Chandrababu: నేడు గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు

నేడు మధ్యాహ్నం 12.45 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అభ్యంతరాలు తెలిపి గవర్నర్ కు ఫిర్యాదు చెయ్యనున్నారు.

Tirumala News: తిరుమల శ్రీనివాసుడి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపల అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీఎం జగన్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్ధం కావడం లేదని, సీఎం జగన్ మరోక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మార్చి, తిరిగి ఎన్టిఆర్ యూనివర్సిటీ పేరు ఉంచాలని కోరుతున్నట్లు అంబికా కృష్ణ అన్నారు.


తిరుమల శ్రీవారిని మలయాళం సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో మలయాళం సినీ హీరోలు అభిషేక్ జోసెఫ్, రాజ్ గోవింద్ పిల్లాయి, మలయాళం సినీ ప్రోడ్యూసర్ ప్రకాష్ లు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

Tirumala News: శ్రీవారి సేవలో సినీ నటుడు తనికెళ్ల భరణి

తిరుమల శ్రీవారిని సినీ నటుడు తనికెళ్ళ భరణి దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తనికెళ్ళ భరణి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన తనికెళ్ళ భరణి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు చాలా సార్లు వచ్చినా ఈ సారి తన మనవడు సర్వజ్ఞ పుట్టి వేంట్రుకల తీయడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకోవడం జరిగిందని, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందని ఎన్ని సార్లు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం పొందినా ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుందని తనికెళ్ళ భరణి అన్నారు.

Nitin Gadkari: నేడు రాజమండ్రిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

  • నేడు రాజమండ్రిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

  • రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో బహిరంగ సభ 

  • మూడు వేల కోట్లతో ఎనిమిది జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి

  • అనంతరం కడియం నర్సరీలను సందర్శించనున్న కేంద్ర మంత్రి


పర్యటన వివరాలు..
గురువారం ఉదయం 9.30 గం.లకు డిల్లీ నుండి బయలు దేరి ఉ.11.30 రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ కు చేరుకుంటారు. మ.12.10 గం.ల నుంచి 12.25 వరకు ఏపీలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై  ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు. తదుపరి మ. 12.30 గం. నుంచి మ.1.30 వరకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేస్తారు. అనంతరం మ.1.30 గం.లకు హెలికాప్టర్ ద్వారా బయలు దేరి మ. 1.45 గం.లకు కడియం నర్సరీ హెలీప్యాడ్ కు చేరుకుంటారు. మ. 1.45 గం. నుంచి మ.2.20 గం. వరకు కడియం నర్సరీలను సందర్శిస్తారు. మ. 2.30 గం. కడియం నర్సరీ హెలిప్యాడ్ నుండి బయలుదేరి గుంటూరు జిల్లాకు గడ్కరీ వెళతారు.

Background

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో నేడు కూడా వర్షాలు బాగా పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తాజాగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలను అనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సుద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్ది ఇది నైరుతి వైపునకు వంగి ఉంది. అల్పపీడనం నేడు ఈశాన్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల వద్ద కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. 


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.


ఏపీలో వాతావరణం ఇలా
అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం కదిలే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో రాగల మూడు రోజులపాటు వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంట ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమలోనూ వానలు పడనున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయి.


తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీయనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.


"కృష్ణా జిల్లా బందరు (మచిలీపట్నం), దివిసీమ భాగాలతో పాటుగా బాపట్ల జిల్లా రేపల్లి, పలు భాగాలతో పాటుగా కాకినాడ నగరంలో కొన్ని వర్షాలు పడనుంది. కొన్ని భాగాల్లో కాస్తంత జోరుగా వర్షాలు పడనున్నాయి. 


అల్పపీడన ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రం మీదుగా కొనసాగుతోంది. ఇందువలన వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనం చూడగలము. మధ్యాహ్నం అరకు వ్యాలీ - అల్లూరిసీతాతామరాజు జిల్లాలో పడి, అలా సాయంకాలానికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, విశాఖ నగరం ఉత్తర భాగాలు, విశాఖ నగర సివార ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులు నమోదవ్వనుంది.


అల్పపీడనం ఉత్తర దిశగా వెళ్తోంది కాబట్టి వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టాయి. కానీ అక్కడక్కడ వర్షాలు కొనసాగడం సహజం. హైదరాబాద్ లో ఈ రోజు సాయంకాలం, రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని వర్షాలుంటాయి. మరో వైపున రాయలసీమ​, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, బాపట్ల​, పల్నాడు, ఉభయ గోదావరి, కొనసీమ​, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్లల్లో మాత్రమే ఈ రోజు వర్షాలను చూడగలము." అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.