Indiramma Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ శర వేగంగా సాగుతున్నట్టు హోసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 95 శాతం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తైనట్టు తెలిపారు. ఇప్పుడు ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ఓపెన్ చేసిన ప్రభుత్వం అర్హులు ఒక్కరు కూడా మిస్ కాకూడదని చెప్పుకొచ్చింది. 


ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల‌కు మ‌రింత పారదర్శకమైన సేవలు అందించేందుకు ఈ ఫిర్యాదుల వెబ్‌సైట్‌ యూజ్ అవుతుందన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానల నివృత్తి చేయడంతోపాటు అనర్హులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఇందిర‌మ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.  


గురువారం నాడు సచివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో ఈ  గ్రీవెన్స్ మాడ్యూల్‌ను  మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టాటస్‌ గురించి ఫిర్యాదుదారుని మొబైల్‌కు మెసేజ్ ద్వారా తెలియ‌జేస్తామన్నారు. 



గ్రామాల్లో ఎంపీడీవో, ప‌ట్ట‌ణాల్లో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ద్వారా సంబంధిత అధికారుల‌కు  ఫిర్యాదు వెళ్తుందని మంత్రి వివరించారు. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థకానికి త‌మ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎలాంటి మధ్యవర్తులు ఉండబోరని అన్నారు. అలాంటి అనుమానాలకు తావులేకుండా అర్హులైన వారికే ఇళ్లు మంజూర‌య్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.  






ఇప్పటికే ఇందిర‌మ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న బుధవారం వరకు హైద‌రాబాద్ మిన‌హా 32 జిల్లాల్లో 95 శాతం పూర్తి అయిందని మంత్రి తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 88 శాతం పూర్తైనట్టు వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అన్నారు. అప్పుడు ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు అందేలా త‌గిన జాగ్రత్తలు తీసుకుంటామని అదే మాదిరిగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  


మొద‌టి విడ‌త‌లో నివాస స్థలం ఉన్న వాళ్లకే ఇళ్లు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. తర్వాత విడతల్లో ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తుందని తెలిపారు. మొద‌టి విడ‌త‌లో విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్ జెండ‌ర్లు, స‌ఫాయి కర్మచారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. 


గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదని ల‌బ్దిదారులే ఇల్లు నిర్మించుకోవాలన్నారు. త‌మ సౌల‌భ్యాన్ని బ‌ట్టి 400 చ‌ద‌ర‌పు అడుగుల‌కు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇళ్లు నిర్మించుకోవ‌చ్చని చెప్పారు. చివ‌రి లబ్ధిదారునికి ఇంటిని మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఇందిర‌మ్మ ప్రభుత్వానిదేనన్నారు. 


Also Read: కళ్యాణ లక్ష్మి పథకం - ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థికసాయం పొందేందుకు కావల్సిన పత్రాలు, అర్హతలు ఇవే!