Vaikunta Ekadasi Tirumala News: దేవుని  స్మరించుకోవడం  ప్రశాంతత.. దండం పెట్టుకోవడం ఆధ్యాత్మికత.. దర్శించుకోవడం భక్తి... ఇవన్నీ కలిస్తేనే ముక్తి.  కానీ ఫలానా సమయంలో ఫలానా చోట దర్శించుకోవడమే ముక్తి.. అప్పుడే పాపాల నుంచి విముక్తి  అని అనుకోవడం.. చెప్పడమే తప్పు. ఈ వెర్రితనం పెరిగి ప్రాణాలు పోయేవరకూ వస్తోంది. బుధవారం రాత్రి తిరుపతిలో జరిగింది అదే. కొన్ని దశాబ్దాలుగా తిరుపతిలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేదు.  దేశంలోనే అత్యున్నతమైన ఆలయ నిర్వహణ వ్యవస్థ టీడీడీ నడుపుతోంది. అలాంటి చోట కూడా ఈ ప్రమాదం జరిగిందంటే ఈ భక్తి-ముక్తి వ్యామోహం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.


 ముక్కోటి నాడు దేవాలయాలకు వెళ్లడం హిందూ సాంప్రదాయంలో ఎప్పుటి నుంచో ఉన్నదే. ముఖ్యంగా వైష్ణవాలయాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయం ఇది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పుణ్యం అని భక్తుల విశ్వాసం. అయితే భక్తి భక్తిలా ఉన్నంతవరకూ పర్వాలేదు..కానీ అది పిచ్చిలా మారితేనే తిరుపతిలాంటి ఘటనలు జరుగుతాయి. 


వైకుంఠ ఏకాదశి నాడే వెళ్లాలి. ఉత్తర ద్వారంలోనే దర్శనం చేసుకోవాలి. ఏం ఇలా చేసుకుంటేనే పాపాలు పోయి సరాసరి వైకుంఠానికి వెళతామా.. లేకపోతే మనకి ముక్తి రాదా..? అసలు ఇలా దర్శనం చేసుకోవాలి ఫలానా చోటనే చేసుకోవాలని ఎక్కడైనా గ్రంథాల్లో ఉందా..? భక్తులను కరుణించే వాడు భగంవతుడు అయితే ఏరోజైనా.. మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజిస్తే. అనుగ్రహిస్తాడు.  ఫలానా రోజకి ప్రాముఖ్యత ఉంది అనుకోవడం తప్పుకాదు. ఆ రోజు దర్శనానికి వెళ్లడమూ తప్పుకాదు.  దేవుడు సర్వాంతర్యామి.. అంటారు కదా... ఆయన నివాసం ఉండే ఏ గుడైనా అంతే పవిత్రం కదా.. మరి మన ఊరిలో ఉన్న.. దగ్గరలో ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు..? 


తిరుమలలో సగటున ప్రతిరోజూ 80వేల నుంచి 90వేల మంది దర్శనం చేసుకుంటారు. రద్దీ తక్కువుంటే కాస్త తగ్గుతారు కానీ ఈసంఖ్యను పెంచడం సాధ్యం కాదు. తిరుమల ఆలయ నిర్మాణం దృష్ట్యా.. ఎక్కువ మంది భక్తులను లోపలకు పంపడం కుదరదు. వెండివాకిలి, బంగారు వాకిలి ప్రాంతాలు ఇరుకుగా ఉంటాయి.. స్వామికి నిత్యం అనేక రకాల అర్చనలు, కైంకర్యాలు ఉంటాయి ఇక వీఐపీల తాకిడి ఎలాగూ తప్పదు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన దేశంలోని వీఐపీలంతా అక్కడే ఉంటారు. వారికి సమయం ఇవ్వాలంటే 70వేల మందికంటే ఎక్కువ దర్శనం కల్పించడం సాధ్యం కాదు. కానీ ప్రతీ ఏటా మూడు నాలుగు లక్షల మంది భక్తులు ఆ రోజు కొండకు వస్తున్నారు.


Also Read: ముక్కోటి దేవతలు అంటే ఎవరెవరు.. వైకుంఠ ఏకాదశిరోజు విష్ణువుతో భూలోకానికి వచ్చేదెవరు!


భక్తి ముదిరి.. 


15-20 ఏళ్ల కిందట తిరుమలలో ఈ పరిస్థితి లేదు. అప్పుడు నిజంగా ఈ రోజును నమ్మి వచ్చే భక్తులే ఉండేవారు.  కానీ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువుగా ప్రచారం కావడం... ఆ రోజు కచ్చితంగా దర్శనం చేసుకోవాలేమో అన్న ఆలోచనను ప్రేరేపిస్తోంది. దీనికి తోడు దేశంలో ఉన్న ప్రముఖ వీఐపీలంతా దర్శనం కోసం పోటీ పడుతుండటంతో కచ్చితంగా ఆ రోజు దర్శనం చేసుకోవాలేమే అని మనలాంటి వాళ్లంతా అనుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఉత్తరద్వారం కోసం తోపులాటలు జరిగి ప్రాణాలమీదకు వచ్చింది.


తప్పు టీటీడీదా...భక్తులదా...?


బుధవారం జరిగిన సంఘటనలో 6మంది ప్రాణాలు పోయాయి.  పుణ్యకార్యం కోసం వచ్చిన వారి ప్రాణాలు తీసిన పాపం ఎవరిది.. అవకాశం లేదూ అని తెలిసి వచ్చిన భక్తులదా.. ? దీనిని ఈ స్థాయిలో ప్రచారం చేసి మార్కెటింగ్ చేసిన టీటీడీదా.. ?వచ్చిన భక్తులను సరిగ్గా నియంత్రించలేని పోలీసు వ్యవస్థదా అంటే ఈ మూడూ కారణాలే. వరుస క్రమంలో ఈ ముగ్గురూ బాధ్యులే. ఎంత చెప్పినా ఆ రోజే వెళ్లి తీరాలనుకోవడం ముందుగా భక్తుల తప్పు.  లేకపోతే.. మరుసుటి రోజు ఉదయం 5గంటలకు టికెట్లు ఇస్తారు అంటే ఇవాళ పొద్దున నుంచే క్యూలైన్లలో ఉండటం ఏంటి..?ఉత్తర ద్వారం ప్రతీ వైష్ణవాలయంలో ముక్కోటి నాడు ఉంటుంది. అక్కడకు వెళ్లాలి. దేవుడికి ప్రతి భక్తుడూ సమానమే.. ప్రతీరోజూ గొప్పదే. కానీ ఇలాంటి పర్వదినాలకు అవసరమైన దానికంటే ప్రాధాన్యత కల్పించడం టీటీడీ చేస్తున్న తప్పు. నిజంగా వైకుంఠ ఏకాదశి మాత్రమే ప్రాధాన్యత ఉంటే పదిరోజుల దర్శనాల పేరిట మార్కెటింగ్ చేయడం కరెక్టు కాదు కదా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిరోజుల వైకుంఠద్వారం ఏంటి అన్నారు. ఇప్పుడు వీళ్లు చేస్తోంది అదే కదా..


Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!


స్థానికంగా విచారించిన తర్వాత ఈ ఘటనకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.



  • టోకెన్ లేకపోతే తిరుమలకు ప్రవేశం లేదు అని ప్రచారం జరగడం ప్రధాన కారణం. టోకెన్ లేకపోతే దర్శనం మాత్రమే లేదు. కానీ కొండకే పంపిచరన్న ప్రచారం జరగడంతో అంతా టోకెన్ల కోసం ఎగబడ్డారు. 



  • టీటీడీ ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా ఏర్పాట్లు చేసింది. కానీ శ్రీనివాసంలో జనాలు ఎక్కువ కావడంతో ఓ మహిళ మృతి చెందింది. భైరాగ పట్టెడలో జనం తక్కువుగా ఉంటారు అనే ప్రచారం చేసి ఆటోలు, జీపుల వాళ్లు భక్తులందరిని అక్కడకు తీసుకెళ్లారు.



  • భైరాగపట్టెడ సెంటర్‌లో ఉదయం నుంచి వచ్చిన వాళ్లని క్యూలైన్లలోకి వెళ్లనీయకుండా ఓ పార్కులో కూర్చోబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా క్యూలైన్లలోకి వదలడంతో పార్కు గేట్లపైనుంచి జనాలు వచ్చేశారు. ఈ తోపులాటలో కొంతమంది కిందపడిపోయారు. అప్పుడు వాళ్లను బయటకు తీయడం కోసం పోలీసులు గేట్లు క్యూలైన్ ఓపెన్ చేయడంతో వెనుక ఉన్నవారు వచ్చేశారు. దీనిని చూసి మిగిలిన వారంతా తోపులాట జరుగుతుందనుకుని ముందుకు దూసుకొచ్చారు. ఇక కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. బహుశా ఇది అనుకోకుండా జరిగినప్పటికీ సరైన సంఖ్యలో సిబ్బందిని పెట్టకపోవడం పోలీసుల తప్పే 



  • తిరుమలలో సివిల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నవాళ్లు.. టీటీడీ అడ్మిన్‌లో ఉన్నవాళ్లంతా కొత్తవాళ్లే. కలెక్టర్, అర్బన్ ఎస్పీ, జెఈవోలు ఎవరికీ అనుభవం లేకపోవడంతో ఏం జరుగుతుందో ఊహించలేకపోయారు.



  • ఇక అధికారుల్లో సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈవో- జేఈవో, చైర్మన్, లోకల్ అధారిటీస్ వీళ్లలో ఎవరి మాట.. ఎవ్వరూ వినేవాళ్లు లేరు. దీంతో అంతా గాలికొదిలేశారు.


Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!


జరిగిన అనర్థం ఎలాగూ జరిగింది. ఇప్పుడు మాట్లాడాల్సింది. ఇక ముందు ఏం చేయాలన్నది.


కేవలం ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలా?


ప్రాణాలమీదకు తెచ్చుకునేంత భక్తి అవసరమా?


ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నంత మాత్రాన చేసిన పాపాలన్నీ పోతాయా? ఇవీ భక్తులు ప్రశ్నించుకోవాలి.


టీటీడీ కూడా పర్వదినాలను ఫాంటసైజ్ చేయడం ఆపాలి


ముఖ్యంగా వీఐపీలు.. మీరు ఎప్పుడైనా దర్శనాలకు వెళ్లొచ్చు. కానీ మీ అత్యుత్సాహం, మొండితనం వల్లే ప్రతి ఒక్కరూ ఇందుకోసం ఎగబడుతున్నారు. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఇకనైనా మారండి.