Tokens Distribution Completed In Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ (TTD) టోకెన్ల జారీని పూర్తి చేసింది. ఈ టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రమే ఈ నెల 10, 11, 12 తేదీల్లో శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. తొలి 3 రోజులకు 1.20 లక్షల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించగా.. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ ఈ కోటా టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 40 వేల చొప్పున 1.20 లక్షల టోకెన్లు జారీ చేశారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకూ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఏరోజుకారోజు ఇవ్వనున్నారు. కాగా, బుధవారం బైరాగిపట్టెడ టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 48 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం భారీ భద్రత నడుమ టోకెన్లు జారీ చేపట్టారు. 


టోకెన్ జారీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో పోలీసులు భక్తులను పంపించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం వివిధ కేంద్రాల వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సాఫీగా సాగింది. రాత్రి జరిగిన ఘటనతో ఆందోళనకు గురయ్యామని.. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందీ లేకుండా టోకెన్లు క్యూలైన్‌లో అందించారని భక్తులు తెలిపారు.


Also Read: Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy : వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?