Breaking News Live Updates: క్వశ్చన్ పేపర్ లీక్ వార్తలపై స్పందించిన విద్యాశాఖ కమిషనర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ఏపీలో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీకైనట్లు వచ్చిన వార్తలపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో ప్రశ్నపత్రం లీక్ అనేది నిజం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. అంకిరెడ్డిపల్లెలో ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభం కాగా 11గంటలకు పేపర్ సోషల్ మీడియాలో కనిపించిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో వచ్చిన వదంతులపైన కూడా ఆయన స్పందించారు. ప్రశ్నాపత్రం లీక్ వార్తలు, తప్పుడు ప్రచారాలు నమ్మెద్దని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు.
చిత్తూరులో పదో తరగతి పరీక్షా పత్రం లీకైంది. తెలుగు పేపర్ - 1 ప్రశ్న పత్రం వాట్సప్‌లో లీకైంది. అయితే, దీనిపై జిల్లా విద్యా శాఖ అధికారులు ఏమీ స్పందించలేదు.
AP SSC Exams: పదో తరగతి పరీక్షలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నందున.. నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. హాల్‌టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. సహేతుక కారణాలతో అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వెళ్లినా అనుమతిస్తామన్నారు.
ఈ ఏడాది 6,22,537మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో బాలికలు 3,02,474మంది ఉన్నారు. 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహేతుక కారణాలతో విద్యార్థులు అరగంట ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా అనుమతిస్తారు. పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి 12.45గంటల వరకు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లతో జరుగుతున్నాయి.పది పరీక్ష కేంద్రాలు ఉంటే పని వేళల్లో మార్పు: పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న బడుల పని వేళలను మార్పు చేశారు.
ఓ ఎక్స్ ప్రెస్ రైలు మచిలీపట్నం వద్ద పట్టాలు తప్పింది. తిరుపతి నుండి మచిలీపట్నానికి వెళ్ళాల్సిన స్పెషల్ ట్రైన్ రివర్స్ యార్డ్ నుండి మూడో నెంబరు ప్లాట్ ఫాంనకు వచ్చే సమయంలో ఇంజన్ కి వెనుక వైపు ఉన్న రెండో, మూడో భోగీలు భీమాస్ హోటల్ వద్ద ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. దీంతో హుటాహుటిన సంఘటన స్ధలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆగమేఘాలపై పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. మచిలీపట్నం రైలు పట్టాలు తప్పడంతో మిగిలిన రైళ్ళ రాకపోకలను తాత్కాలికంగా కొంత సేపు నిలిపి వేశారు రైల్వే అధికారులు. ట్రైన్ లో ఎవరూ లేని సమయంలో ఘటన చోటు చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన రైల్వే అధికారులు మరమ్మత్తులు చేశారు.
Background
ఉపరితల ద్రోణి ప్రభావం, పలుచోట్ల కురిసిన తేలికపాటి జల్లులు కురుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయ్. ఓ వైపు గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణ, యానాంలలో పలు జిల్లాల్లో ప్రతిరోజూ అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఉత్తర కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉండగా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఉపరితల ద్రోణి ప్రభావం, ట్రోపో వాతావరణంలో గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఏప్రిల్ 30 వరకు వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రికి వర్షాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. అత్యధికంగా తునిలో 41.7 డిగ్రీలు, విశాఖపట్నంలో 40 డిగ్రీలు, ఒంగోలు, అమరావతిలో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఈ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలుచోట్ల నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమే ఉంటుంది కానీ వర్ష సూచన లేదని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అనంతపురంలో 41.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు, నంద్యాల, తిరుపతిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆరోగ్యవరంలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయి. కొన్ని జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. నైరుతి, దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగారం, వెండి ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,450 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,860 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.70,500 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,500 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,450 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,860గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,500 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -