TTD Chairman Responded On Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. 'ఓ సెంటర్‌లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారు. దీంతో టోకెన్ల కోసమే గేట్లు తీశారని భావించిన భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 40 మంది వరకూ గాయపడ్డారని సమాచారం. వీరు తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.' అని పేర్కొన్నారు.
క్షతగాత్రులకు పరామర్శ
తొక్కిసలాట ఘటనలో గాయపడి రుయా, స్విమ్స్ ఆస్రత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అటు తొక్కిసలాట ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎలాంటి కుట్ర లేదని.. ఇది ప్రమాదవశాత్తు మాత్రమే జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు గురువారం ఉదయం పరామర్శకు వస్తారని.. మృతులకు సంతాపం తెలపడం సహా క్షతగాత్రులను పరామర్శిస్తారని తెలిపారు. మృతుల కుటుంబాలకు కూడా పరిహారం ప్రకటించనున్నట్లు చెప్పారు.
అసలేం జరిగిందంటే.?
కాగా, తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించగా.. 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అంతటా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మృతులు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50)లుగా గుర్తించారు. అంతకు ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు.
తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేయగా.. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని తెలపగా.. బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. బుధవారం సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.