Help Line Number For Victims Information Tirupati Stampede Incident: తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందడం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 48 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అంబులెన్సులో రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల వద్ద అంబులెన్సుల మోత, క్షతగాత్రుల బంధువల రోదనలతో దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 0877 - 2236007 నెంబరును సంప్రదించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినా.. తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని.. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశించారు.


సీసీ కెమెరాల పరిశీలన



మరోవైపు, తోపులాట ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొందరు భక్తులు అనవసరంగా అత్యుత్సాహానికి పోయి తోయడమే దుర్ఘటనకు కారణమయిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఘటనకు దారి తీసిన పరిణామాలపై పూర్తి నివేదిక తయారుచేయాలని భావిస్తున్నారు.


తిరుపతి మంత్రులు


ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మంత్రులు, టీటీడీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో క్షతగాత్రులకు సహాయ చర్యలు, వైద్య సేవలు పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్‌ల బృందం తిరుపతికి చేరుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిరంతరం టీటీడీ అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.


అటు, తిరుపతి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇదీ జరిగింది..


కాగా, తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించగా.. 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మృతులు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు (51), విశాఖకు చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50)లుగా గుర్తించారు. అంతకు ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.


Also Read: AP Inter Exams Fact Check: మొదటి ఏడాది పరీక్షల్ని ఏపీ ఇంటర్ బోర్డు రద్దు చేసిందా ? - ఇదిగో అసలు నిజం