TPBO Results: తెలంగాణ మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను టీజీపీఎస్సీ(TGPSC) జనవరి 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను అందుబాటులో ఉంచింది. మొత్తం 171 మంది అభ్యర్థులతో జాబితాను టీజీపీఎస్సీ రూపొందించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను జోన్లవారీగా హాల్‌టికెట్ నెంబర్లతో కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో 'టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (టీపీబీవో) పరీక్ష జులై 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని టీఎస్‌ఎస్‌సీ జులై 12న విడుదల చేసింది. ప్రాథమిక కీపై జులై 13 నుంచి జులై 15న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 21, 24; డిసెంబర్ 5, 6, 7, 23 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది. తాజాగా ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది.
టీపీబీవో ఫలితాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి గతేడాది సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్ష మరోసారి వాయిదాపడింది. దీంతో జులై 8న పరీక్ష టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్ధులకు గుడ్ న్యూస్. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. దాంతో పాటు మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పింది. అధికారులు ఇచ్చిన ఖాళీల వివరాలను తనిఖీ చేసి నోటిఫికేషన్ జారీపై ఏప్రిల్ లో కసరత్తు చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. దాంతో పాటు త్వరలోనే గ్రూప్ - 1,2,3 ఫలితాలు కూడా విడుదల చేస్తామని చెప్పింది.
ఏప్రిల్ తర్వాతే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగా నోటీఫికేషన్స్ (Notifications)ను జారీ చేస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేషం తెలిపారు. మార్చి 31, 2025లోపు పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్స్ ఫలితాలిస్తామని.. ఏప్రిల్ 2025 తర్వాతే నోటిఫికేషన్స్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ లో భర్తీపై స్టడీ చేసి.. మే 1 నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. అంతకంటే ముందు ఖాళీల భర్తీపై ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. ఆ తర్వాత వెంటనే పరీక్షలు నిర్వహించి.. ఏ పరీక్ష ఫలితాలు పూర్తయితే వాటిని వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా ఫలితాలు, భర్తీ విషయంలో ఆలస్యం జరగదన్నారు. నోటిఫికేషన్స్ ఇచ్చిన 6 నుంచి 8 నెలల్లో ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.