రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి తలపెట్టిన నైట్ కర్ఫ్యూ వాయిదా పడింది. సంక్రాంతి తర్వాత రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి జనవరి 31 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది. పండుగ వేళ పల్లెలకు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే కర్ఫ్యూ వాయిదా వేశామని మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేయాలని ఆదేశించింది. తాజా వైద్య ఆరోగ్యశాఖ కర్ఫ్యూపై మార్గదర్శకాలు జారీచేసింది.
Also Read: ఆర్జీవీతో 4 గంటలు.. కమిటీ మాత్రం 2 గంటలే చర్చ ! ఇక నివేదిక రెడీ చేస్తారా ?
జనవరి 31 వరకు నైట్ కర్ఫ్యూ
రాష్ట్రంలో ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. నైట్ కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలికమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చింది. షాపింగ్ మాల్స్, వాణిజ్య దుకాణాలు కోవిడ్ మార్గదర్శకాలు పాటించకపోతే రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశించింది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలుచేయాలని, సీటు విడిచి సీటు మార్కింగ్ చేయాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, కార్యక్రమాల్లో 200 మంది మించరాదని షరతులు విధించింది. ఆర్టీసీతో సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది.
Also Read: ఆర్మీ స్కూల్స్‌లో టీచర్ ఉద్యోగాలు.. 57ఏళ్ల వయసు వాళ్లు అప్లై చేసుకోవచ్చు..
కోవిడ్ నిబంధనలు పాటించకపోతే భారీగా ఫైన్
ఇండోర్ హాల్స్ లో జరిగే కార్యక్రమాల్లో 100 మందిని మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత డిసెంబరు రెండో వారంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో గరిష్ఠంగా 500 మంది హాజరయ్యేందుకు అనుమతి ఉంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ ఈ నిబంధనలను సవరించారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఇతర కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం కోరింది. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధించాలని ఆదేశాలు జారీచేసింది. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల్లో మాస్కులు ధరించనివారు కనిపిస్తే వాటి యజమానులకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశించింది.
Also Read: ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ ప్రారంభించిన సీఎం జగన్.. నేటి నుంచే దరఖాస్తులు, వెబ్‌సైట్ వివరాలు ఇవీ..