ఈ మధ్య చాలా వరకూ ప్రతి నేరం వెనుక అందుకు మూలం వివాహేతర సంబంధం కారణం అయి ఉంటోంది. తాజాగా అలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. నేరం అనంతరం నిందితులు సాక్షాన్ని మాయం చేసే క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికి పోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో భార్య వివాహేతర సంబంధం భర్త హత్యకు దారి తీసింది. ఆమె పరాయి వ్యక్తితో నెరుపుతున్న సంబంధం భర్తకు తెలియడంతో నిలదీశాడు. దీంతో భార్య ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించింది. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. 


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్‌ అనే 37 ఏళ్ల వ్యక్తికి బుద్దారం గ్రామానికి చెందిన మాధవితో పదేళ్ల కిందటే పెళ్లి జరిగింది. అయితే, భార్య మాత్రం నాగర్‌ కర్నూల్‌కు చెందిన జంగం రమేష్‌ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని రహస్యంగా కొనసాగిస్తోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేశ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కాగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం చివరకు భర్తకు తెలిసిపోయింది.


భర్త వెంకటేష్‌ తన భార్యను వివాహేతర సంబంధం గురించి నిలదీశాడు. దీంతో భార్య భర్తను ఎలాగైనా అంతం చేయాలని నిశ్చయించుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆదివారం రాత్రి ఎప్పటిలా భోజనం చేసి నిద్ర పోతున్న సమయంలో చంపాలని ప్రణాళిక వేసింది. అప్పటికే, వేసిన ప్లాన్ ప్రకారం.. భార్య మాధవి రమేష్‌తో కలిసి భర్త వెంకటేష్‌ గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలని నిర్ణయించుకున్నారు. 


ఈ క్రమంలోనే భర్త శవాన్ని మధ్యలో ఉంచుకొని బైక్‌పై ముగ్గురూ నాయినోని పల్లి శివారులో మెయిన్ రోడ్డుపై వేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అలా వెళ్తుండగా మధ్యలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. వీరిని గుర్తించిన హన్వాడ పోలీసులు ప్ర ధాన రహదారిపై వారిని ఆపేశారు. భయంతో ఇద్దరూ మృతదేహాన్ని వదిలి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వెంకటేష్‌కు భార్యతోపాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఈ ఘటనపై వెంకటేష్‌ తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  


Also Read: Nalgonda Crime: గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..


Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి