నల్గొండ జిల్లాలో సోమవారం (డిసెంబరు 11) ఉదయం మైసమ్మ గుడి ముందు మనిషి తల కనిపించడం స్థానికంగా భయాందోళన కలిగించిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం  విరాట్‌నగర్‌ కాలనీ సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ విరాట్‌నగర్‌ కాలనీ నాగార్జునసాగర్‌ - హైదరాబాద్‌ జాతీయ రహదారి వెంట ఉంది. అయితే, పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాబట్టారు. మొత్తానికి ఓ వ్యక్తి తల నరికి దాన్ని అక్కడ ఉంచినట్లుగా గుర్తించారు. ఆ వ్యక్తి మతిస్తిమితం లేని వ్యక్తిగా తేల్చారు. అయితే, ఈ ఆకృత్యం గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వడమా? లేక మరేదైనా ఉద్దేశంతో చేశారా? అనేది తేలాల్సి ఉంది. తల భాగాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, వెంట్రుకలు, చర్మాన్ని డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రహదారి పక్కనే మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం ఉంది. సోమవారం ఉదయం అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల ఉండడాన్ని ఆలయ పూజారి బ్రహ్మచారి తొలుత గుర్తించారు. ఆయన భయపడిపోయి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ ఆనంద్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. మృతుడిని గుర్తించేందుకు తల ఫొటోను సోషల్ మీడియాలో పెట్టారు. పలువురి సమాచారం ఆధారంగా మృతుడు జహేందర్‌ నాయక్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి అని తేల్చారు. అతడిది సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్య పహాడ్‌ గ్రామమని ప్రాథమికంగా నిర్ధరించారు. 


అయితే, ఈ తరహాలో హత్య నరబలి కోసమే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో గుట్టల్లో గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. అందుకే పోలీసులు ఆ కోణంలో అనుమానిస్తున్నారు. గతంలో ఆ తరహా నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను ఆరా తీస్తున్నారు. తల ఉన్నచోట రక్తపు ఆనవాళ్లు లేకపోవడం, తలకు గడ్డి, మట్టి అతుక్కుని ఉండడంతో అతణ్ని ఎక్కడో చంపి తల ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. 


మృతుడికి మతిస్తిమితం లేదు
మృతుడి గురించి ఆరా తీయగా.. జహేందర్‌ నాయక్‌కు మతిస్థిమితం లేదని.. ఐదారేళ్లుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడని తెలిసింది. కొన్నాళ్లుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజాల్‌ సమీపంలో ఓ ఆలయం వద్ద ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండేవాడు. పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు 8 బృందాలను నియమించినట్లుగా డీఎస్పీ ఆనంద్‌ రెడ్డి వెల్లడించారు. సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.


Also Read: అరె ఏంట్రా ఇది.. లోన్ రిజెక్ట్ చేశారని ఏకంగా బ్యాంకునే తగలెట్టేశాడు, అంతా బూడిదే


Also Read: ఈ నాలుగు రాశుల వారు ఈ రోజు ఏం చేసినా సక్సెస్ అవుతారు, మీరున్నారా అందులో ఇక్కడ తెలుసుకోండి..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి