ఏపీలో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌కు సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలో ప్రారంభించారు. ఎలాంటి వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే మధ్య తరగతి ప్రజలకు అందించే లక్ష్యంగా దీన్ని ప్రారంభించినట్లుగా సీఎం జగన్ చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాపేక్ష కూడా లేకుండా ప్రభుత్వం ఈ ఎంఐజీ లే అవుట్లు వేస్తోందని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు. మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు జరుగుతున్నాయని అన్నారు.
మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ఈ పథకంతో నెరవేరుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు కేటగిరీల్లో స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం చెప్పారు. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాలు అందిస్తామని సీఎం వివరించారు. ప్రజలు వారి స్తోమతను బట్టి ప్రజలు ఎంపిక చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
మొదటి దశలో ఈ ఏరియాల్లో లే అవుట్లు
మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తామని అన్నారు. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని జగన్ చెప్పారు. అన్ని అనుమతులు, పర్మిషన్లతో డిమాండ్‌కు అనుగుణంగా మూడు కేటగిరీల్లో ప్లాట్లను సిద్ధం చేశారని తెలిపారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు.
ప్లాట్ల కోసం migapdtcp.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లే అవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.
లే అవుట్లలో ప్రత్యేకతలు ఇవే..
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్ డీడ్‌తో ప్రభుత్వమే ఈ లే అవుట్లు వేస్తుందని జగన్ అన్నారు. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించామని అన్నారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు.