ఏపీలో ఇంటర్మీడియట్ ప్రవేశాలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టులో దాఖలపై వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, మరికొందరు విద్యార్థులు ఇంటర్ ఆన్లైన్ విధానంపై హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.
గతంలో మాదిరిగానే పత్రికా ప్రకటన
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. ఆన్‌లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదని కోర్టుకు తెలిపారు. పత్రికా ప్రకటన ద్వారా ఇంటర్ బోర్డు ఆన్‌లైన్ విధానాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. గతేడాది పత్రిక ప్రకటనతో ఆన్‌లైన్ విధానం తీసుకువస్తే హైకోర్టు తప్పుపట్టిందని తెలిపారు. చట్టపరంగా విధివిధానాలు రూపొందించుకోవాలని సూచించిందని గుర్తుచేశారు. గతంలో మాదిరిగానే మళ్లీ పత్రికా ప్రకటన ఇచ్చి ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిందని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఏపీ ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధమని, నిబంధనలను రూపొందించకుండా ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడానికి వీల్లేదని వాదనలు వినిపించారు.
Also Read: Jagananna Colonies: జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి పావలా వడ్డీకే రుణాలు.. సీఎం జగన్ ఆదేశాలు
కరోనా ఓ సాకు మాత్రమే
రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మేర, విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఆన్‌లైన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది. సాధారణ ప్రవేశాలకు కరోనా అడ్డంకి అయితే ఆగస్టు 16 నుంచి ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థులకు తరగతులు ఎలా నిర్వహిస్తున్నారని, ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడం కోసం కరోనాను సాకుగా చూపుతున్నారని న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆన్లైన్ అడ్మిషన్ల వల్ల విద్యార్థులకు నచ్చిన కాలేజీ ఎంచుకునే హక్కును హరిస్తున్నారన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదని, విద్యార్థులను గ్రేడ్లు ద్వారా ఉత్తీర్ణుల్ని చేశారని తెలిపారు. విద్యార్థుల జీవితంతో ముడిపడి ఉన్న విషయంలో ఆన్‌లైన్ విధానం తీసుకురావడంలో సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు ఈ నెల 10న ఇచ్చిన విధానాలను రద్దుచేయాలని కోరారు.
Also Read: Supreme Court: కొలీజియం సిఫార్సులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 9 మంది జడ్జీలు
విద్యార్థుల సంక్షేమం కోసమే..
ఇంటర్ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్‌దవే వాదనలు వినిపించారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. పరీక్షలు నిర్వహణ కారణంగా కొవిడ్‌తో విద్యార్థికి హాని జరిగినా భారీగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందని తెలిపారు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే 2.50 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఆ వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు. ఆన్‌లైన్ ప్రవేశాలకు ఈ నెల 27 వరకు ఉన్న సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Also Read: Prakasam: సొంత బాబాయినే చంపిన కొడుకు.. శవం దగ్గరే బహిరంగంగా అరిచి చెప్పి బీభత్సం!