దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల 9 మంది పేర్ల జాబితాను ప్రభుత్వానికి పంపింది. ఈ పేర్లను పరిశీలించిన కేంద్రం తాజాగా వారి నియామకానికి అనుమతినిచ్చింది. 


ఈ 9 మంది పేర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపింది. ఆయన నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే వీరంతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వీరితో కలిపితే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరనుంది. సాధారణంగా 34 మంది జడ్డీలు ఉండాలి. ఒక స్థానం ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారి.


ఎవరెవరున్నారు?

సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వానికి సిఫార్సు చేసిన పేర్లలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వీరిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న ఒకరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు ఆమెకు ఉన్నాయి. అదే జరిగితే భారత న్యాయ చరిత్రలో చీఫ్ జస్టిస్ అయిన తొలి మహిళగా జస్టిస్ నాగరత్న రికార్డులకెక్కుతారు.


హైకోర్టు చీఫ్ జస్టిస్ లు..



  • జస్టిస్ విక్రమ్ నాథ్ (గుజరాత్)

  • జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా (కర్ణాటక)

  • జస్టిస్ హిమా కోహ్లీ (తెలంగాణ)

  • జస్టిస్ జేకే మహేశ్వరి (సిక్కిం)


హైకోర్టు జడ్జీలు..



  1. జస్టిస్ బీవీ నాగరత్న (కర్ణాటక)

  2. జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్ (మద్రాస్)

  3. సీటీ రవి కుమార్ (కేరళ)

  4. బేలా ఎమ్ త్రివేది (గుజరాత్)

  5. పీఎస్ నరసింహ (సీనియర్ అడ్వకేట్)


సోమవారమే ప్రమాణస్వీకారం..


రాష్ట్రపతి ఆమోదం తెలిపి నియామక ఉత్తర్వులు జారీచేస్తే వచ్చే సోమవారం కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేపట్టే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 17న సమావేశం కాగా.. 18వ తేదీన న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణ చేశారు. ఫలితంగా ఆ ఒక్క ఖాళీకి పేరును సిఫార్సు చేయలేకపోయింది.


ముగ్గురు కొత్త మహిళా న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకుచేరుతుంది. 


Also Read: Nityananda Kailasa : నిత్యానంద "కైలాస"కు దగ్గరి దారి తెలిసిపోయింది..! ఇక పోలీసులు వెళ్తారా..?