కైలాస దేశాధినేత నిత్యానంద ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్‌ను కూడా ప్రకటించారు. రిజర్వ్ బ్యాంక్‌తో పాటు కైలాస డాలర్‌ను కూడా ఆవిష్కరింాచరు.  వాటి పేర్లు  'కైలాస రిజర్వ్ బ్యాంక్'   'కైలాషియన్ డాలర్' గా ఖరారు చేశాడు. రిజర్వ్‌ బ్యాంక్ పని చేయడం కోసం వేరే దేశానికి చెందిన మరో రిజర్వ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నారట.  తన డాలర్లు ప్రపంచం మొత్తం చెల్లుబాటు కావని కేవలం కైలసతో ఒప్పందం చేసుకున్న దేశాలలో మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు. ఆ దేశాలేవో నిత్యానంద ఇంకా ప్రకటించలేదు. ఒప్పందాలు చేసుకుంటామని చెబుతున్నారు. కైలాస దేశంతో ఆర్థిక, దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకున్న వారితోనే తమ ఆర్థిక వ్యవహారాలు సాగుతాయని నిత్యానంత ప్రకటించుకొచ్చారు. అత్యాచర ఆరోపణల కారణంగా పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయపడి పారిపోయిన ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. 


కానీ తనకు తాను కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నానని.. సొంత రాజ్యాంగం.. సొంత కరెన్సీ.. సొంత పాస్‌పోర్ట్ కూడా రెడీ అయిందని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో  కనిపించి చెబుతూ ఉంటారు. తాజాగా ఆయన యూట్యూబ్‌లో తన డాలర్లను ఆవిష్కరించిన వీడియోను పెట్టారు.  ఈ వీడియోలో పది రకాల కైలాషియన్ డాలర్లను చూపించారు. పావు డాలర్ నుంచి పది డాలర్ల వరకూ డినామినేషన్ ఉంది. ఇది కేవలం లాంఛనమైన ప్రకటన మాత్రమేనని.. త్వరలో వీటి చెలామణి ప్రారంభమవుతుందని నిత్యానంద చెబుతున్నారు. విశేషం ఏమిటంటే నిత్యానంద దేశంలో అంతా బంగారమే. కరెన్సీ కూడా బంగారంతోనే తయారు చేస్తారు. డాలర్లు అన్నీ బంగారతోనే తయారు చేస్తున్నారు.  ఒక్క డాలర్ దాదాపుగా పన్నెండు గ్రాముల బంగారంతో తయారు చేస్తారు. పది డాలర్ల నాణెం అయితే నూట పదహారు గ్రాములు ఉంటుందని నిత్యానంద ప్రకటించారు. ఇంతటితో ఆగలేదు కైలాస దేశానికి అధికారిక ముద్ర, చిహ్నాలను కూడా ఆవిష్కరించారు. అక్కడి ప్రభుత్వంలో భాగమైన వారు మాత్రమే వాటిని ధరిస్తారట.  



భారత దేశంలో నిత్యానంద పరారీలో ఉన్న నేరస్తుడు. ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు కూడా ఉంది.  ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు కానీ.. ఆయన   పసిఫిక్ ద్వీప దేశమైన రిపబ్లిక్ ఆఫ్ వనాటు నుంచి బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నట్లుగా కొన్ని పత్రాలు కొన్ని బయటకు వచ్చాయి. ఆయన పత్రాలు.. వ్యాపార లావాదేవీలు మొత్తం రిపబ్లిక్ ఆఫ్ వనాటు దేశం ద్వారానే జరుగుతున్నాయి. కైలాస దేశం కోసం ఓ వ్యక్తి వివరాలు అడుగగా.. అతన్ని ఆ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయమని అడిగారు. ఆ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అంటే ఆ దేశంలో అయినా ఉండాలి లేదా...  ఆ సమీప ద్వీపాల్లో అయినా క్షేత్రం ఏర్పాటు చేసుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.  అయితే ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేకంగా భారత దర్యాప్తు బృందాలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.