Jagananna Colonies: పేదలకు శుభవార్త.. వారి ఇళ్ల నిర్మాణానికి పావలా వడ్డీకే రుణాలు.. సీఎం జగన్ ఆదేశాలు

ABP Desam Updated at: 26 Aug 2021 10:12 AM (IST)

జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇళ్ల నిర్మణానికి పావలా వడ్డీకే రుణాలు

NEXT PREV

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. 



లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్‌ చేశాం. అత్యవసర సమయాల్లో వాటిపై రుణం తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించాం. అలా తీసుకునే రుణంపై లబ్ధిదారుడికి పావలా వడ్డీ పడుతుంది. మిగతా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణ సదుపాయంవల్ల ఇళ్ల నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెర్ప్‌, మెప్మాల సహకారంతో పావలా వడ్డీ రుణాలు అందుతున్నాయి. కరోనా మూడో దశ వస్తుందో లేదో తెలీదు కానీ అందుకు సన్నద్ధంగా ఉండాలి. వైద్యులు, పడకలు, ఆసుపత్రులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు సిద్ధం చేసుకోవాలి. విద్యాసంస్థలు ప్రారంభమైనందున ఎవరిలోనైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ వెంటనే పరీక్షలు నిర్వహించాలి.                        - జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం


సమీక్ష..


పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుకు సంబంధించి 21 రోజుల్లోగా దరఖాస్తుదారుడి అర్హత నిర్ధారించాలని జగన్ సూచించారు. 90 రోజుల్లోగా వాటిని మంజూరు చేయాలన్నారు. ఇళ్ల పట్టాలు, నేతన్న నేస్తం, చేయూత, మత్స్యకార భరోసా తదితర పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు. 90 రోజుల్లోగా అర్హత నిర్ధారించి వారికి ఆరు నెలల్లోగా పథకం మంజూరు చేయాలని తెలిపారు.


కొత్త దరఖాస్తుల స్వీకరణ



ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తులను స్వీకరించి వారికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 8వేల దరఖాస్తుల పరిశీలనను వెంటనే పూర్తి చేయాలి. అర్హులుగా గుర్తించిన 1,99,663 మందిలో 56వేల మందికి ప్రస్తుతం ఉన్న లేఅవుట్‌లలో పట్టాలిస్తాం. మరో 1,43,560 మందికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి. 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. ఇప్పటివరకూ 10.11 లక్షలు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటి ప్రగతిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లకు సంబంధించి అక్టోబరు 25లోగా అన్ని సన్నాహకాలు పూర్తికావాలి.                          - వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ సీఎం

Published at: 26 Aug 2021 08:20 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.