సెప్టెంబర్ 1న జరగనున్న కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అనుసరించాల్సిన వ్యూహం పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకురాబోయే ఎజెండా అంశాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్ సీ మురళీధర్ తదిరతులు పాల్గొన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటివాటాకోసం కేఆర్ఎంబీ, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ చెప్పారు. సాధికారిక సమాచారంతో కేఆర్ఎంబీ సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు సూచించారు.
కేఆర్ఎంబీకి ఏపీ లేఖ
మరోవైపు తాజాగా కృష్ణా జలాల్లో తమకు 70 శాతం వాటా కేటాయించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపిందని ఆ ప్రకారమే ఇక ముందు కూడా కేటాయింపులు జరపాలని కోరింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని లేఖలో ఏపీ ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ ఏడాది నీటి కేటాయింపులు జరిపే వరకూ తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగం చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్‌ఎంబీని కోరింది. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు లేఖలో ఏపీ ఈఎన్‌సీ వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం ఇలా లేఖ రాయడానికి కారణం .. కృష్ణా జలాల్లో సగం సగం వాటా కావాల్సిందేనని కొద్ది రోజుల కిందట తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖలు రాయడమే. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేనందున తాత్కాలికంగా ఈ వాటర్ ఇయర్‌లో.. 811 టీఎంసీల కృష్ణా జలాలను చెరి సగం పంచాలంటూ తెలంగాణ పట్టుబడుతోంది. అలా కేటాయించవద్దని ఏపీ సర్కార్ కోరుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీల కృష్ణా నీటిని గతంలో బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది.
ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరగాలంటూ తెలంగాణ ప్రభుత్వం బ్రిజే్‌షకుమార్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విభజన అనంతరం ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే నిష్పత్తితో జలాలను పంచుకోవడానికి అప్పట్లో రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కానీ ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ప్రారంభమయ్యాయి. దీంతో కృష్ణా జలాలను చెరి సగం పంచాలని తెలంగాణ డిమాండ్ చేయడం ప్రారంభించింది.