కర్ణాటక మైసూర్ లో దారుణ ఘటన జరిగింది. ఓ విద్యార్థినిపై కొంతమంది సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం బసవరాజ్ బొమ్మై విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు.


అసలేం జరిగింది..?






మైసూరుకు చెందిన ఓ యువతీ యువకుడు ఆగస్టు 24న నగర శివారుల్లోని చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లారు. ఆలయం బయటికి వచ్చాక  సమీపంలోనే వారిని చుట్టుముట్టిన దోపిడీ దొంగలు డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్‌ చేశారు. అందుకు నిరాకరించడంతో వారిపై దాడికి పాల్పడ్డారు. యువకుడిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అనంతరం యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కోలుకున్న బాధితులు ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తునట్లు తెలిపారు.


ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువతి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.