Breaking News Live: మంచినీటి చెరువులో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తూర్పు గోదావరి జిల్లా యానాం సమీపంలోని కనకాలపేట మంచి నీటి చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్ధులు గల్లంతయ్యారు. పొన్నాడ గణేష్ (14) మృతి మరొక బాలుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేడిని తట్టుకోలేక చల్లదనం కోసం చిన్నారులు చెరువులు దిగినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ధిక్కరణ కేసులో మరో ఐఏఎస్ కు జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కారణకు పాల్పడిన ఐఏఎస్ అధికారి గార్గ్ ఖాతాన్‍కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది హైకోర్టు. వారం రోజుల్లో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. నష్ట పరిహారం కేసులో కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశారని బాధితురాలు ఆరోపిస్తుంది. దీంతో బాధితురాలు రైల్వే కోడూరు వాసి వాసి నరసమ్మ కోర్టును ఆశ్రయించింది. మైనింగ్‍లో భాగంగా నరసమ్మ ఇంటిని 2003లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నష్టపరిహారం చెల్లించాలని ఐఏఎస్ అధికారి గార్గ్ ఖాతాన్‍కు గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ అనుమతి చర్చించేందుకు DCGI సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (SEC) ఇవాళ సమావేశం కానుంది. 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో భారత్ బయోటెక్ కోవాక్సిన్, బయోలాజికల్-ఇ కార్బెవాక్స్ వ్యాక్సిన్‌లను అత్యవసర సమయంలో వినియోగంపై నిపుణుల కమిటీ నిపుణుల కమిటీ సిఫార్సులు చేయనుంది.
అమలాపురం కిమ్స్ లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 50 మంది నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మహబూబాబాద్‌లో దారుణం జరిగింది. టీఆర్‌ఎస్ కౌన్సిలర్ రవిని దుండగులు హత్య చేశారు. పత్తిపాక కాలనీకి బైక్‌పై వెళ్తుండగా నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మెతుకు నర్సింహ రాములు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ముసారాంబాగ్ శాలివాహన టౌన్ నగర్‌లో నివాసం ఉంటున్న అతని ఇంటిపై మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఉదయం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఈ తనిఖీలు చేశారు. గత కొన్నాళ్లుగా ఈ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చందానగర్‌లో మరో ఇద్దరు టీపీఎస్ అధికారుల పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. మరికొందరు అధికారులపై దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఒంగోలు కలెక్టరేట్ వద్ద బీజేపీ భారీ ధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా పాల్గొన్నారు. బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని బీజేపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై సీబీసీఐడీ విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలభద్రపురం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ వెంట ఐటీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఉన్నారు. పర్యటనలో భాగంగా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్ కాస్టిక్ సోడా యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా, విజయవాడ ఈస్ట్ వైసిపి ఇంచార్జ్ దేవినేని అవినాష్, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల టిటిడి మాజీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ. స్వామి వారి దర్శన టోకెన్లు లేని భక్తులను అలిపిరిలో ఆపే హక్కు టీటీడీ అధికారులకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎండ తీవ్రతకు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని, గతంలో ఎండ వేడి నుండి ఉపశమనం కలిగేలా టీటీడీ చలవపందిళ్లు ఏర్పాటు చేసేదని ప్రస్తుతం మే నెల వస్తున్నా తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడం దారుణం అన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని పని చేసే అధికారులకు ఎండలో ఇబ్బంది పడే సామాన్య భక్తుల కష్టాలు ఎలా తెలుస్తుందన్నారు. ఇకనైనా సామాన్య భక్తులపై టిటిడి దృష్టి సారించి మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
నేడు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రారంభించననున్న గ్రాసిమ్ ఇండస్ట్రీ పరిశ్రమ యూనిట్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Background
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో నేడు కూడా వర్షాలు కురవనున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నేడు కూడా తీరం వెంబడి కాస్త బలమైన గాలులు వీయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏపీలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మిగతా చోట్ల మాత్రం ఎండల తీవ్రత అధికంగానే ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు (Rains In Andhra Pradesh)
ఏపీలో నేడు ఉత్తర కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రం వాతావరణం పూర్తిగా పొడిగానే ఉండనుంది. రాయలసీమలో తేలికపాటి జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల పడనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడనున్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
‘‘ఇక ఈ అకాల వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టనుంది. ప్రస్తుతానికి ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడి గాలులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెంచనుంది. ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు దగ్గరగా నమోదవ్వనుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదుకానుంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మొత్తం రాయలసీమ జిల్లాలు, ప్రకాశం పశ్చిమ భాగాలు, నెల్లూరు పశ్చిమ భాగాలు, గుంటూరు, కృష్ణా, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎండలు విపరీతంగా ఉండనుంది. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది. మరో వైపున ఉత్తరాంధ్ర విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాయంకాలం విశాఖ ఏజెన్సీ, మారేడుమిల్లి వైపు కొన్ని వర్షాలుంటాయే గానీ ఎండలు మాత్రం తగ్గే ప్రసక్తి లేదు.
తెలంగాణలో ఎండలు (Rains In Telangana)
మరోవైపున తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాలు - భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబబాద్, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమరంభీం అసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామబద్, సిద్ధిపేట, సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్ గిరి, కరీంనగర్, కమారెడ్డి, సంగరెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 మధ్యలో ఉండనుంది. హైదరబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీల దాక ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
తెలంగాణలో నేటి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రత నిన్న 43 డిగ్రీలుగా ఆదిలాబాద్‌లో నమోదైందని వెల్లడించింది.
ఏపీలో కొన్ని చోట్ల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ప్రజలు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అలల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని మత్స్యకారులను హెచ్చరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -