SCR Rescheduled Trains Timings: నూతన సంవత్సర వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన చేసింది. పలు రైళ్ల ప్రయాణ వేళలను మార్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 1 (బుధవారం) నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని చెప్పారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించడం సహా రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (Ratnachal Express) విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఉదయం 6:15 గంటలకు బయలుదేరుతుండగా.. ఇకపై మారిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటలకే విజయవాడ నుంచి బయలుదేరుతుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.
ఎంఎంటీఎస్ రైళ్లలోనూ మార్పులు
అలాగే, జనవరి 1వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తుండగా.. ప్రయాణికుల సౌకర్యార్థం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు ద.మ రైల్వే తెలిపింది.
ఈ ప్రత్యేక రైళ్లు పొడిగింపు
మరోవైపు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను పొడిగించింది. జనవరి 7వ తేదీ నుంచి మార్చి 25 వరకూ షోలాపూర్ - ముంబయి (రైలు నెం. 01435) వరకు ప్రతి మంగళవారం రైలును ద.మ రైల్వే పొడిగించింది. జనవరి 1 నుంచి మార్చి 26 వరకూ ఎల్‌టీటీ ముంబయి - షోలాపూర్ (రైలు నెం. 01436) వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉండనుంది. జనవరి 2 నుంచి మార్చి 27 వరకూ ప్రతి గురువారం షోలాపూర్ - తిరుపతి (రైలు నెం. 01437), జనవరి 3 నుంచి మార్చి 28 వరకు తిరుపతి - షోలాపూర్ (రైలు నెం. 01438) ప్రతి శుక్రవారం అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also Read: Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !