Breaking News Live: సిరివెన్నెల మృతిపై సీఎం జగన్ సంతాపం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల ఒక శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటు అన్నారు. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో స్వర్గస్తులయ్యారు.
టీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో లోక్‌సభ మార్మోగిపోయింది. దీంతో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
తిరుపతిలోని డాలర్ శేషాద్రి నివాసం వద్దకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేరుకున్నారు. అంతకుముందు మర్యాదపూర్వకంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి సీజేఐని కలిశారు. సీజేఐ వెంట తెలంగాణ ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు కూడా ఉన్నారు. శేషాద్రి పార్థివ దేహానికి జస్టిస్ ఎన్వీ రమణ నివాళి అర్పించారు. శేషాద్రి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
తిరుపతి : డాలర్ శేషాద్రి స్వామికి టీటీడీ అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు. వీరిటో పాటు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్, మాజీ సీఎస్ అజయ్ కల్లాంలు శేషాద్రి స్వామికి మంగళవారం ఉదయం నివాళులర్పించారు. నేటి మధ్యాహ్నం రెండు గంటలకు శేషాద్రి స్వామి అంత్యక్రియలు తిరుపతిలోని హరిశ్చంద్ర స్మశాన నాటికలో సంప్రదాయ పద్దతిలో నిర్వహించనున్నారు.
అనంతరం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీవారి ఆలయంలో వందలాది మంది అర్చకులు, పీఠాధిపతులు, ఆగమోక్తులు తరించి పునీతులు అయ్యారని చెప్పారు. మన తరంలో మనం చూసిన శేషాద్రి స్వామి విశిష్టమైన వ్యక్తి అని, సామాన్య ఉద్యోగిగా సేవలు ప్రారంభించి స్వామి ప్రధాన ఆచార వ్యవహారాల్లో పాత్ర పోషించే స్థాయికి ఆయన ఎదిగారన్నారు..
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సబ స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో వెల్‌లోకి దూసుకువెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు.
విద్యా దివెన నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు రూ.686 కోట్లు కేటాయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. విద్యార్థులను గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. గత ప్రభుత్వ బకాయిలు రూ.1178 కోట్లు చెల్లించినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం చన్గోముల్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్టేషన్ సమీపంలోని ఓ ఫాం హౌస్ వద్ద ప్రేమ జంట కలుపు మందు సేవించి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. వీరిని గుర్తించిన పోలీసులు వెంటనే ఇరువురిని వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. గత శనివారం ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళిపోయిన ఇద్దరు.. నిన్న రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇంట్లో తిడతారని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఫ్లైఓవర్‌పై ఒక్కసారిగా మంటలు చెలరేగటం కలకలం రేపింది. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానం ప్యాట్నీ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం అయింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు రావడంతోనే అప్రమత్తమై వారు కారు నుంచి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. కారు దగ్ధం కావడంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాల రాకపోకలకు అవాంతరం తలెత్తింది.
తెలంగాణ ఆర్టీసీ నేడు నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదానం చేసిన వారికి.. తిరుగు ప్రయాణం ఉచితంగా ఉంటుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీ, రెడ్ క్రాస్ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్, ఎంజీబీఎస్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. జూబ్లీ బస్ స్టేషన్‌లో ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరాన్ని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించన్నట్లు ఈడీ తెలిపారు. ఎంజీబీఎస్‌లో రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా సజ్జనార్ పాల్గొననున్నట్లు తెలిపారు.
Background
తిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఓఎస్‌డ్డీ డాలరు శేషాద్రి పార్ధీవదేహం తిరుపతికి చేరుకుంది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశాఖలో తితిదే నిర్వహిస్తున్న కార్తీకదీపోత్సవం కార్యక్రమం కోసం విశాఖ వెళ్ళిన డాలర్ శేషాద్రి సోమవారం వేకువజామున గుండెపోటుతో చివరిశ్వాస విడిచారు. చికిత్స పోందుతూ ఆస్పత్రిలో పరమపదించిన డాలర్ శేషాద్రి పార్ధీవదేహన్ని రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని ఆయన నివాసంకు పార్థీవదేహం తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డాలర్ శేషాద్రి పార్ధీవదేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నగరంలోని హరిశ్చంద్ర స్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగారుపేటలో కేసీ కెనాల్ వెంట ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని మున్సిపల్ అధికారులు జేసీబీలతో కూల్చే శారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమకు ముందస్తు సమాచారం లేకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని స్ధానికులు మున్సిపల్ సిబ్బందిని అడ్డు కున్నారు. అయినప్పటికీ అధికారులు ఇళ్లు తొలగిం చారు. ఇళ్లు కోల్పోయిన మేము ఎక్కడ నివాసం ఉండాలని బంగారు పేట వాసులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. కలెక్టరేట్ లోకి వెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ తమకు ఇళ్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చేంత వరకూ కదలమని కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద బైఠాయించారు.
నిరాశ్రయులకు అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, జవాద్ తుఫాన్ కారణంగా ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి, ఆదుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్ బాషా అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో వరదల వల్ల ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులులైన వరద బాధిత కుటుంబాలకు మొత్తం రూ.17,56,500 నగదు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ.. కడప నగరంలోని కొన్ని ప్రాంతాలలో వరద నీరు ఇళ్లలోకి చేరిందన్నారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి అన్ని సహాయ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి జిల్లా కలెక్టర్ , జిల్లా యంత్రాంగానికి మానవతా దృక్పథంతో సహాయసహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అలాగే నగరంలోని రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి 24/7 గంటల పని చేయడం జరిగిందన్నారు.
Also Read: CM Jagan Review: వారికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలి.. వెంటనే పనులు మొదలు పెట్టాలి
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -