KTR in Formula E Car race Hyderabad | హైదరాబాద్: తనపై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసును కొట్టివేయాలని తెలంగాణ (Telangana) మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేయడం తెలిసిందే. దాంతో ఆయన తన లీట్ టీం సలహాతో సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లడానికి బదులుగా సుప్రీంకోర్టుకు వెళ్లడమే బెటర్ అని లాయర్లు కేటీఆర్‌కు సూచించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేయడంతో పాటు ఫార్ములా ఈ కార్ వ్యవహారంలో తనపై నమోదైన కేసు కొట్టివేసేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
కేటీఆర్ పిటిషన్‌ను హైకోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది..
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ పై నమోదైన కేసును ఈ దశలో కొట్టివేయలేమని జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం తీర్పు వెలువరించారు. 10 రోజులపాటు ఎలాంటి అరెస్ట్ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని, గత ఆదేశాలను కొనసాగించేలా తీర్పు ఇవ్వాలని కేటీఆర్ లాయర్ గండ్ర మోహన్ రావు చేసిన అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది. హెచ్ఎండీఏకు చెందిన నిధులను ఆర్థిక శాఖ లేక తెలంగాణ కేబినెట్ ఆమోదం లేకుండానే విదేశీ సంస్థలకు చెల్లించాలని కేటీఆర్ ఆదేశించారని స్పష్టమైంది. అయితే ఇది స్వలాభం కోసం చేశారా, ఇతరులు ఎవరికైనా లబ్ది చేకూర్చేందుకు ఆ విధంగా చెల్లింపులు చేశారా తేలాలంటే దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిజాలు నిగ్గు తేలాలంటే ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు జరగాలని కోర్టు పేర్కొంది.
దర్యాప్తు సంస్థలను అడ్డుకోవడం సరికాదు
ఫార్ములా ఈ రేసులో నిధుల దుర్వినియోగం జరిగిందని డిసెంబర్ 18న ఫిర్యాదు రాగా, ఏసీబీ ఆ మరుసటి రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై ఐపీసీ సెక్షన్ 409తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) సెక్షన్లు సహా మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది. తనను అరెస్ట్ చేస్తారేమోనని భావించిన కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు కొట్టివేసి దర్యాప్తు సంస్థలను అడ్డుకోవడం సరికాదని, నిధుల దుర్వినియోగం జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, హెచ్ఎండీఏ నిధులు ఓ సంస్థకు చెల్లించారని ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
నిధుల దుర్వినియోగంపై దర్యాప్తులో తేలుతుంది
పురపాలక శాఖ మంత్రిగా తనకున్న అధికారాలతోనే నిధుల విడుదలకు అనుమతి ఇచ్చానని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ ఫార్ములా రేసుపై ఒప్పందానికి ముందే నిధుల విడుదలకు ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ఆస్తుల విషయంలో కేటీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహించారో లేక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందని కోర్టు పేర్కొంది. మంత్రులు ప్రభుత్వ ఆస్తులకు కేవలం ఏజెంట్‌గా వ్యవహరించాలని, పరిమితికి మించి అధికారాలు వాడి నిధులు విడుదల చేయడం సరికాదని న్యాయమూర్తి అన్నారు.
నిధులు విడుదల జరిగింది కనుక ప్రాథమికంగా కేసు నమోదు, దర్యాప్తు చేపట్టడాన్ని తప్పు పట్టలేం. నిధుల విడుదల చేశారని ఆధారాలున్నాయి, కనుక దరుద్దేశంతో చేశారా, స్వార్థ ప్రయోజనాల కోసమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కనుక కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించలేమని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read: KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్