Breaking News Live: మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మృతి?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 14 Oct 2021 09:22 PM
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?

మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

దసరా పండుగ వేళ హైదరాబాద్ విజయవాడ రహదారిపై విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగకు అందరూ ఇళ్లకు వెళ్తుండడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం.

మత్స్యకారుల వలకు చిక్కిన 20 కేజీల చేప

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదుగా దొరికే తెరపార చేప చిక్కింది. దీని బరువు 20 కేజీలు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. సొర జాతికి చెందిన ఈ చేపను సొరారి అని కూడా పిలుస్తారని చెప్పారు. దీనిని వేలం పాట ద్వారా రెండు వేల రూపాయలకు విక్రయించినట్లు వారు తెలిపారు.

దసరా పండుగ వేళ తీవ్ర విషాదం

దసరా పండుగ వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని కైకలూరు మండలం వరాహపట్నంలో ఈ ఘటన జరిగింది. వరాహపట్నం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఈత రాక నలుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయటికి తీయించి పోస్టుమార్టం కోసం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తెలుగు అకాడమీ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు

తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఏపీలోని గుంటూరులో సాంబశివరావును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన సమీప బంధువు సాంబశివరావు. డిపాజిట్లు గోల్‌మాల్ చేసిన వారికి ఈయన సహకరించినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.50 లక్షలు ఆయన వాటాగా తీసుకున్నారు. ఈయన్ను హైదరాబాద్ తీసుకొచ్చాక సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.

మంత్రి తలసానిని కలిసిన మంచు విష్ణు

‘మా’ ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు గురువారం తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిశారు. ఆయన వెంట ట్రెజరర్ శివబాలాజీ కూడా ఉన్నారు. ఈనెల 16 వ తేదీన జరిగే ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచు విష్ణుకు మంత్రి తలసాని శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

తిరుమలకు సీజేఐ, ఏపీ సీజే

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా శ్రీవారి దర్శనార్థం హైదరాబాద్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి జిల్లా అధికార యంత్రాంగం  పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు.

అమీర్ పేట్ లో ఉద్రిక్తత... టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు

హైదరాబాద్ అమీర్ పేట్ లో ఉద్రిక్తత నెలకొంది. ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఆసుపత్రి వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో మంత్రులు మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.   

హీరో బాలకృష్ణతో మోహన్ బాబు, విష్ణు భేటీ

హీరో బాలకృష్ణతో మా అధ్యక్షుడు మంచు విష్ణు, మోహన్ బాబు భేటీ అయ్యారు. బాలకృష్ణ ఇంటికి వచ్చిన మోహన్ బాబు, విష్ణు అరగంటపైగా సమావేశం అయ్యారు. మా ఎన్నికల్లో విష్ణుకు అండగా ఉంటానని బాలకృష్ణ తెలిపారు. 

మనీలాండరింగ్ కేసులో నోరా ఫతేకు ఈడీ సమన్లు...

బాలివుడ్ నటి నోరా ఫతేకి ఈడీ నోటీసులు ఇచ్చింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని ఆదేశింది. ఇదే కేసులు జాక్వలిస్ ను కూడా ఈడీ ప్రశ్నించింది. 

దేశంలో కొత్తగా 18 వేల పైగా కేసులు, 246 మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 18,987 కేసులు, 200కు పైగా మరణాలు సంభవించాయి. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ తాజా కొవిడ్ గణాంకాలను వెల్లడించింది. నిన్న దేశంలో 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 16 శాతం పెరుగుదల కనిపించింది. నిన్న 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నాను. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.33 కోట్ల మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు రెండు లక్షలకు చేరువలో కొనసాగుతున్నాయి. ఆ కేసుల సంఖ్య 2.06 లక్షలకు చేరింది. బుధవారం మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో మొత్తంగా 4,51,435 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  

ఏపీలో నేటి నుంచి 100 ఆక్యుఫెన్సీతో థియేటర్లు ఓపెన్

ఆంధ్రప్రదేశ్ సినిమా ధియేటర్ల వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రోజుకు మూడు షోలు యాభై శాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఉండేది. అయితే కొత్తగా కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 

హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

నేటి నుంచి అమల్లోకి కృష్ణా, గోదావరి గెజిట్ నోటిఫికేషన్

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నిర్ణయించిన గెజిట్ నోటిఫికేషన్ నేటి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రాలు అంగీకరించిన ప్రాజెక్టులను బోర్డులు ముందుగా తమ ఆధీనంలోకి తీసుకోనున్నాయి. గోదావరికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కృష్ణాకు సంబంధించి బోర్డు రూపొందించిన 15 ఔట్ లెట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలపాల్సిఉంది. గెజిట్ కు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జారీ చేయాల్సి ఉంది

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.