Man Collapse While Playing Lord Ram In Ramlila Drama In Delhi: ఓ ప్రదర్శనలో రాముడి పాత్ర పోషిస్తోన్న ఓ వ్యక్తి స్టేజీపైనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన ఢిల్లీలో (Delhi) శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని షహదారాలో జై శ్రీరామలీలా విశ్వకర్మ నగర్‌లో ప్రదర్శన సందర్భంగా సుశీల్ కౌశిక్ (45) అనే వ్యక్తి రాముడి పాత్ర పోషించాడు. అయితే, నాటకం మధ్యలో కౌశిక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో స్టేజీ వెనుక వైపునకు వెళ్లి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వారు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
కాగా, ఈ ఏడాది జనవరిలోనూ ఇలాంటి ఘటనే హర్యానాలో చోటు చేసుకుంది. భివానీలో రామ్‌లీలాలో హనుమంతుని పాత్ర పోషిస్తోన్న 62 ఏళ్ల వ్యక్తి ప్రదర్శన మధ్యలోనే గుండెపోటుతో మృతి చెందాడు. 2022, అక్టోబర్‌లోనూ యూపీ అయోధ్య జిల్లాలో రావణుడి పాత్రలో నటించిన ఓ వ్యక్తి స్టేజీపైనే పడి ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: Drugs Seized: మధ్యప్రదేశ్‌లో డ్రగ్స్ కలకలం - రూ.1,800 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం